సిద్దిపేట జిల్లాలో ప్రియురాలికి పెళ్లవుతోందని యవకుడు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో ప్రియురాలికి పెళ్లవుతోందని యవకుడు సూసైడ్
  • సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం అంబార్​పేటలో ఘటన

గజ్వేల్/వర్గల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని, ఆమె కుటుంబీకులు దాడి చేసి కొట్టారనే మనస్తాపంతో సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం అంబార్​పేటకు చెందిన ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గౌరారం ఎస్సై కరుణాకర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగెల్ల పవన్​ కల్యాణ్(20) ఇదే మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి(19) మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.

 వారిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబసభ్యులతో అబ్బాయికి గొడవ జరిగింది. ఇటీవల అమ్మాయికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించగా, విషయం తెలుసుకున్న పవన్​ ఈ నెల 18న అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడిపై అమ్మాయి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లవుతోందని, ఆమె కుటుంబ సభ్యులు తనను కొట్టారని మనస్తాపానికి గురైన పవన్​ కల్యాణ్​ అక్కడే కలుపు మందు తాగాడు. 

అనంతరం తానే స్వయంగా గజ్వేల్​ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఆరోగ్యం కుదుటపడడంతో పవన్​ను కుటుంబ సభ్యులు19న ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు మళ్లీ అస్వస్థతకు గురవడంతో లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం హాస్పిటల్​కు, అక్కడి నుంచి హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. 

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డీబీఎఫ్  జాతీయ కార్యదర్శి పి.శంకర్  మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, పరువు హత్యగా కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​  చేశారు.