పిల్ల దొరుకుతలేదు..పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు

పిల్ల దొరుకుతలేదు..పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు
  • ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్న అమ్మాయిలు
  • వయసు, ఉద్యోగం, ఆస్తులు, జాతకాలు.. అన్నీ చూసుకుంటున్నరు
  • రాష్ట్రంలో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు
  • సెక్స్రేషియోలో భారీ తేడా వల్లే సమస్య..  కొన్ని కులాల్లో పరిస్థితి తీవ్రం
  • అమ్మాయిల కోసం అనాథాశ్రమాల్లోనూ ప్రయత్నిస్తున్న యువకులు
  • ఈ ఏడాది ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 928 మంది ఆడ పిల్లలే
  • భువనగిరిలో అత్యంత తక్కువగా 887 మందే 

కొడుక్కి పెళ్లి చేద్దామని అమ్మాయి కోసం చుట్టాల్లో వెతికించారు హైదరాబాద్‌లో ఉండే రమేశ్‌ రావు. సెట్ కాకపోవడంతో తెలిసిన వాళ్లతో వెతికించారు. తర్వాత మ్యారేజ్‌ బ్యూరోలను సంప్రదించారు. అక్కడ కూడా సరిపోలేదు. దీంతో చివరకు ఓ అనాథ ఆశ్రమాన్ని ఆశ్రయించారు. ‘పిల్లను ఇవ్వండి. బంగారం లెక్క చూసుకుంటం’ అని ఆశ్రమ నిర్వాహకులకు అర్జీలు పెట్టుకున్నారు. ఇది ఒక్క రమేశ్‌ పరిస్థితి మాత్రమే కాదు. అమ్మాయిలు దొరక్క అవస్థలు పడుతున్న చాలా మంది ఇలా ఆశ్రమాల మెట్లు ఎక్కుతున్నారు.

హైదరాబాద్‌‌, వెలుగు: లగ్గం చేసుకుందామంటే పిల్ల దొరకడం లేదు. అమ్మాయికి పెళ్లి వయసొచ్చిందంటే గతంలో తల్లిదండ్రులు భయపడే వాళ్లు. కట్నం, ఖర్చు గురించి తెగ ఇదైపోయే వారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. అబ్బాయిల తల్లిదండ్రులు ఇక్కట్లు పడుతున్నారు. అమ్మాయిలను వెతకలేక అవస్థలు పడుతున్నారు. వేరే కులంలో చేసుకునేందుకు సిద్ధపడుతున్నా, సంబంధాలు సెట్ కావడం లేదు. రూ.లక్షల్లో సంపాదిస్తున్నా, పైసా కట్నం లేకుండా పెండ్లి చేసుకునేందుకు రెడీ అంటున్నా పరిస్థితి మాత్రం మారటం లేదు. ‘ఓ పిల్ల దొరికితే చాలు దేవుడా’ అని మొక్కుకుంటున్నారు. ఒకట్రెండేళ్లు వెతికి అమ్మాయి దొరక్కపోయే సరికి అబ్బాయిలు డిప్రెషన్‌‌కు గురవుతున్నారు.

వీళ్లకు తిప్పలే తిప్పలు

రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ కులాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సొంత కులంలో చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు. సెక్స్‌‌ రేషియోలో ఉన్న భారీ తేడా వల్ల భవిష్యత్‌‌లో కులాలతో సంబంధం లేకుండా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం.. 6 ఏండ్ల లోపు పిల్లల్లో ఆడ, మగ నిష్పత్తి 957:1000 ఉండగా, 2011 నాటికి 932:1000కి పడిపోయింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2013–14 నాటికి లింగ నిష్పత్తి (సెక్స్‌‌ రేషియో ఎట్‌‌ బర్త్‌‌) 918:1000గా ఉంటే, 2015 నాటికి ఇది 901:1000కి తగ్గింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నమోదైన జననాల ప్రకారం 5 జిల్లాల్లో అమ్మాయిలు, అబ్బాయిల నిష్పత్తి 900 కంటే తక్కువగా నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆడపిల్లల కొరత మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు కొడుకో, కూతురో పెండ్లీడుకు రాగానే తమ చుట్టాల్లోనో, బాగా తెలిసిన వాళ్లలోనో సంబంధాలు వెతుక్కునేవారు. కానీ, ఇప్పుడు ఆడ పిల్లలు దొరక్క ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. చివరికి మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. నాలుగైదు బ్యూరోల్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలను అబ్బాయిలు సెలెక్ట్ చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అబ్బాయిలను అమ్మాయిలే సెలెక్ట్ చేసుకుంటున్నారని ‘శుభం మ్యారేజ్‌ బ్యూరో’ ప్రతినిధి లలిత చెబుతున్నారు. కులం, కట్నం, ప్రాంతం వంటి పట్టింపులు పోయి, అబ్బాయి వయసు, ఉద్యోగం, సెటిల్ అయిన ప్రాంతం, ఆస్తులను మాత్రమే అమ్మాయిలు చూస్తున్నారని అంటున్నారు. అన్ కండిషనల్‌గా పెండ్లి చేసుకుంటామనుకునే అబ్బాయిలకు కూడా మ్యారేజ్ సెట్ చేయడానికి సగటున 8 నుంచి 10 నెలలు పడుతోందంటున్నారు. అమ్మాయిల కండిషన్లకు ఒప్పుకోలేక కొందరు, అసలు అమ్మాయిలే దొరక్క మరికొందరు చివరకు అనాథ ఆశ్రమాల్లో పెరిగే అమ్మాయిలను చేసుకునేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్నారు ఆశ్రమాల నిర్వహకులు.

యథేచ్ఛగా స్కానింగ్​లు

ఈ ఏడాది నమోదైన జననాల్లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు కేవలం 928 మంది ఆడ పిల్లలే ఉన్నారు. భువనగిరి (887), నల్గొండ (888), వరంగల్ రూరల్ (881), సూర్యాపేట (894), జనగామ (896), వనపర్తి  (900) జిల్లాల్లో మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల జననాల సంఖ్య అత్యల్పంగా నమోదైంది. ఇంత జరుగుతున్నా అటు పాలకులుగానీ, ఇటు అధికారులుగానీ సీరియస్‌గా తీసుకోవడంలేదు. నిర్లక్ష్యం వీడడం లేదు. పీసీపీఎన్‌డీటీ (ప్రీ కాన్సెప్షన్‌ అండ్ ప్రీ నాటల్‌ డయాగ్నస్టిక్ టెక్నిక్స్‌) చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్లపై ‘డెకాయ్‌’ ఆపరేషన్లు నిర్వహించాలి. నేషనల్‌ హెల్త్ మిషన్‌ కింద ఇందుకు అవసరమైన నిధులను కేంద్రమే అందిస్తుంది. అయినా మన అధికారులు స్కానింగ్ సెంటర్లపై ఈ ఏడాది కనీసం ఒక్క డెకాయ్ ఆపరేషన్ కూడా చేయలేదు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ర్టంలో 3,833 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. మరో 770 సెంటర్ల దరఖాస్తులు ఆరోగ్యశాఖ అధికారుల వద్ద ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రతి నెలా లక్షల్లో స్కానింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో గర్భం తొలి దశలోనే ఆడో, మగో తెలుసుకుని,ఆడపిల్లలు అయితే  అబార్షన్లు చేయించుకుంటున్నారు.

చాలా మంది ఫోన్లు చేస్తున్నరు

ఎక్కడా దొరక్క మా హోమ్స్‌‌లో అమ్మాయిలను చేసుకుంటామని చాలా మంది ముందుకొస్తున్నారు. నిత్యం ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి. సెక్స్‌‌ రేషియో తగ్గిపోవడం భవిష్యత్‌‌లో చెడు పరిణామాలకు దారి తీసే ప్రమాదముంది. అబ్బాయిలు డిప్రెషన్‌‌లోకి వెళ్తారు. మహిళలపై పెరుగుతున్న దాడులకు ఇదో కారణంగా చొప్పొచ్చు.

‑ పద్మావతి, కస్తూర్బా గాంధీ ట్రస్ట్‌‌

నాలుగేండ్ల నుంచి సంబంధాలు చూస్తున్నం

మా పెద్ద కొడుకు కోసం నాలుగేండ్ల నుంచి సంబంధాలు వెతుకుతున్నాం. వాడి సంపాదన, మా ఆస్తి కంటే వాడు చేసే జాబ్‌‌ గురించే అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. మా కులంలో అమ్మాయిలు తక్కువగా ఉండడం, ఉన్నవాళ్ల కోరికలకు అంతు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. మ్యారేజ్‌‌ బ్యూరోల్లోనూ రిజిస్టర్ చేసుకున్నాం. కట్నం కూడా మేం కోరుకోవడం లేదు.

‑ డి.భాగ్యరాణి, పెద్దపల్లి