బాస్‌‌ వేధింపులకు యువతి ఆత్మహత్య.. కంపెనీపై 90 కోట్ల పెనాల్టీ

బాస్‌‌ వేధింపులకు యువతి  ఆత్మహత్య.. కంపెనీపై 90 కోట్ల పెనాల్టీ
  • టోక్యో కోర్టు సంచలన తీర్పు
  • కోర్టు ఉత్తర్వులతో పదవి నుంచి తప్పుకున్న నిందితుడు
  • మృతురాలి ఫ్యామిలీకి సారీ చెప్పిన యాజమాన్యం

టోక్యో(జపాన్‌‌): ఉద్యోగంలో చేరిన 25 ఏండ్ల యువతికి వేధింపులే స్వాగతం పలికాయి. ఆఫీస్‌‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి పై అధికారి నుంచి ఎగతాళి ఎదురైంది. బాస్‌‌ వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. జపాన్‌‌లోని టోక్యోలో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 

ఈ కేసులో టోక్యో కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలి కుటుంబానికి రూ.90 కోట్లు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని ఆదేశించింది. అవమానకరంగా వేధింపులకు గురిచేసిన బాస్‌‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులిచ్చింది.

వీధి కుక్క అంటూ వేధింపులు.. 

జపాన్‌‌లోని ప్రముఖ కాస్మెటిక్స్‌‌ కంపెనీ డీయూపీ కార్పొరేషన్‌‌లో సతోమి అనే యువతి 2021 ఏప్రిల్‌‌లో ఉద్యోగంలో చేరింది. అదే ఏడాది డిసెంబర్‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌లో ఆమెను కంపెనీ ప్రెసిడెంట్‌‌ మిత్సురు సకాయ్‌‌ అవమానించాడు. పర్మిషన్‌‌ లేకుండా క్లయింట్‌‌ను కలిసినందుకు తిట్లదండకం అందుకున్నాడు. వీధికుక్క అంటూ తీవ్రంగా మాట్లాడాడు. 

దీంతో సతోమి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఆ తర్వాత రోజుల్లోనూ ఏదోఒక సాకుతో ఆమెను మిత్సురు వేధించాడు. చేతగాని కుక్క ఎక్కువగా మొరుగుతోందంటూ ఎగతాళిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో సతోమి తట్టుకోలేకపోయింది. ఆఫీస్‌‌కు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయింది. డిప్రెషన్‌‌తో ఆస్పత్రిపాలైంది. ఆపై ఆత్మహత్యకు యత్నించింది. ఫలితంగా కోమాలోకి వెళ్లిపోయింది. అలా ఆస్పత్రిలో ఏడాదిపాటు పోరాడి 2023 అక్టోబర్‌‌‌‌లో సతోమి కన్నుమూసింది. 

అప్పటికే ఆమె తల్లిదండ్రులు కంపెనీపై కేసు వేయగా పోలీసుల దర్యాప్తు కొనసాగింది. కంపెనీలో బాస్‌‌ వేధింపులే సతోమి మృతికి కారణమని తేలింది. తుది వాదనల తర్వాత సతోమి మరణానికి మిత్సురే బాధ్యుడని టోక్యో కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పు వచ్చిన వెంటనే మిత్సురు తన పదవికి రాజీనామా చేయగా, కంపెనీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పింది.