దేవుడు పిలుస్తున్నాడని ..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి.. మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన

దేవుడు పిలుస్తున్నాడని ..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి.. మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన


 

మేడిపల్లి, వెలుగు: ‘నేను చాలా డిప్రెషన్​లో ఉన్నాను.. నన్ను శివయ్య పిలుస్తున్నాడు’ అంటూ ఓ యువతి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్​లోని సాయి ఐశ్వర్య కాలనీలో నివసించే బెల్లంకొండ శైలజ కుమార్తె మధు హసిత (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రెండేండ్ల క్రితం ఓ యువకుడితో హసిత ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మందలించడంతో గత పది నెలలుగా అతనితో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఇంట్లో హసిత రాసిన లేఖ లభించింది. అందులో ‘నేను డిప్రెషన్​లో ఉన్నాను.. నన్ను శివయ్య పిలుస్తున్నాడు’ అని రాసి ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.