ప్రాణం తీసిన బీసీబంధు లొల్లి

ప్రాణం తీసిన బీసీబంధు లొల్లి
  •     అన్న డబ్బులు పంచియ్యలేదని తమ్ముడి గొడవ
  •     క్షణికావేశంలో ఆత్మహత్య

చిన్నశంకరంపేట, వెలుగు : బీసీ బంధు కింద మంజూరైన ఆర్థిక సహాయం పంచుకునే విషయంలో అన్నతో గొడవపడి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ముత్యాలు, శంకర్​ అన్నదమ్ములు. వీరిద్దరి కుటుంబాలు వేరు వేరుగా ఉంటున్నాయి.

ప్రభుత్వం కుల వృత్తుల వారికి బీసీ బంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని ప్రకటించడంతో ముత్యాలు, శంకర్​ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ముత్యాలు ఒక్కడికే రూ.లక్ష మంజూరైంది. దీంతో ఈ డబ్బులను అన్నదమ్ములిద్దరూ కలిసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకు సమస్య కారణంగా ముత్యాలు తన తమ్ముడు శంకర్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యమయ్యాయి.

ఈ క్రమంలో శనివారం రాత్రి శంకర్ డబ్బులు ఇంకా ఎప్పుడు ఇస్తావంటూ అన్నతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో శంకర్ ​భార్య శ్యామల.. భర్తను వారించింది. ఆగ్రహించిన​శంకర్​‘నువ్వు నాకు సపోర్ట్ ​చేయకుండా మా అన్న వాళ్లకే సపోర్ట్ చేస్తున్నావ్’ అని తిట్టాడు. అదే కోపంతో ఇంట్లోకి వెళ్లి ఊయల తాడుకు ఉరేసుకున్నాడు. ఇంతలోనే కుటుంబసభ్యులు లోపలకు వెళ్లి గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.