పొలానికి బాట ఇస్తలేడని అన్నను కరెంట్​ పెట్టి చంపిండు

పొలానికి బాట ఇస్తలేడని అన్నను కరెంట్​ పెట్టి చంపిండు
  •     పోస్టుమార్టంలో బయటపడిన అసలు విషయం
  •     ములుగు జిల్లా రాజుపల్లిలో ఘటన

ములుగు, వెలుగు: వ్యవసాయ భూమికి వెళ్లేందుకు బాట ఇవ్వడం లేదని ములుగు జిల్లాలో సొంత అన్నను కరెంట్ పెట్టి చంపేశాడో తమ్ముడు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయగా, పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. సీఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కావటి భిక్షపతి(42), సుధాకర్ అన్నదమ్ములు.

వీరికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి కింద చెరో రెండున్నర ఎకరాల పొలం వచ్చింది. అందులో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే భూముల పంపిణీ అప్పటి నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పొలం బాట విషయంలో పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ తమ్ముడి పొలానికి భిక్షపతి బాట వదల్లేదు.

దీంతో అన్నపై కక్ష పెంచుకున్న సుధాకర్ చంపేయాలని డిసైడ్​అయ్యాడు. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం సుధాకర్, అతని భార్య మాధవి పొలం వద్దకు వెళ్లారు. అదే సమయంలో పొలానికి నీళ్లు పారించేందుకు భిక్షపతి కూడా వెళ్లాడు. అదే అదునుగా భావించిన సుధాకర్, అతని భార్య మాధవి.. అటవీ జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు భిక్షపతి చేను చుట్టూ ఏర్పాటు చేసుకున్న కరెంటు ఉచ్చులకు కరెంట్ సప్లయ్​అయ్యేలా చేశాడు. ఆ విషయం తెలియని భిక్షపతి, వాటిని తాకడంతో షాక్​కు గురై చనిపోయాడు.

సాయంత్రం అయినా పొలానికి వెళ్లిన భిక్షపతి ఇంటికి రాకపోవడంతో, అతని భార్య సుజాత పొలం వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. మృతుని సెల్​ఫోన్, చెప్పులు, వేర్వేరు చోట్ల పడి ఉండడంతో, కచ్చితంగా మరిది సుధాకర్​కుట్రపూరితంగా చంపేశాడని సుజాత భావించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న ములుగు సీఐ మేకల రంజిత్ కుమార్, ఎస్సై అప్పని వెంకటేశ్వర్ కరెంట్​షాక్​తోనే భిక్షపతి చనిపోయాడని నిర్ధారించుకున్నారు. మృతుని భార్య అనుమానం వ్యక్తం చేయడంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని గురువారం ములుగు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, నిజం తేల్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. శుక్రవారం మృతదేమానికి పోస్టుమార్టం నిర్వహించగా, మర్డర్​అని తేలింది. తామే కరెంట్​పెట్టి చంపినట్లు సుధాకర్, అతని భార్య మాధవి పోలీసుల ముందు ఒప్పుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్​చేసినట్లు సీఐ తెలిపారు. మృతునికి భార్య సుజాతతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు.