
ముంబై: తమ టీమ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్‌పై ఎలాంటి ప్రెజర్ లేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తనపై ఎప్పుడూ అంచనాలు ఉంటాయని, వాటి గురించి పెద్దగా ఆందోళన చెందబోనని స్పష్టం చేశాడు. ‘ఐపీఎల్‌లోనే కాకుండా ఎక్కడ ఆడటానికి వెళ్లినా మాపై అంచనాలు సహజం. చాలా ఏళ్లుగా ఆడుతున్నాను కాబ్టటి వాటి వల్ల నాకు ఎలాంటి ఇబ్బందిలేదు. మా వంతు కృషి చేసి ట్రోఫీ గెలవడం మా టార్గెట్. అయితే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తే మనపై ఒత్తిడి పెరుగుతుంది. టీమ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్ బ్రేవిస్, తిలక్ వర్మతో పాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. వాళ్లకు స్పష్టమైన గేమ్ ప్లాన్ ఉంటుంది.
సహజంగా ఫస్ట్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ల నుంచి నేను ఏం ఆశిస్తున్నానో ప్లేయర్లకు బాగా తెలుసు. వాళ్లను కాపాడుతూ మంచి పెర్ఫామెన్స్‌ను రాబట్టడమే నా బాధ్యత’ అని కొత్త సీజన్‌కు ముందు ముంబైలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌కు కొనసాగింపు మాదిరిగా ఐపీఎల్‌ను భావించాలని కుర్రాళ్లకు హిట్‌మ్యాన్ సలహా ఇచ్చాడు. కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. టీమ్ డైనమిక్స్‌పై ప్రభావం చూపుతుందన్నాడు. అయితే కొన్ని మ్యాచ్‌లు జరిగిన తర్వాత దీనిపై పూర్తి అవగాహన వస్తుందన్నాడు.