కొలువులు ఇస్తమనికూలీలను చేసిన్రు

కొలువులు ఇస్తమనికూలీలను చేసిన్రు
  •  
  • పోలేపల్లి సెజ్​లో భూ నిర్వాసితులకు దక్కని న్యాయం
  • ఇంటికో ఉద్యోగం ఇస్తామని జాబ్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం
  • ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్​ చదివినా.. డైలీ లేబర్లుగా స్థానికులు
  • ఆంధ్ర, ఇతర రాష్ట్రాలవారికే పర్మనెంట్​ ఉద్యోగాలు


మహబూబ్​నగర్, వెలుగు:మీ భూములు సెజ్​కు ఇస్తే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇస్తామని ఆశ చూపారు. జాబ్​ కార్డులూ జారీ చేశారు. ఇప్పుడు  కార్పొరేట్​సంస్థలు కంపెనీలు పెడుతున్నా, భూ బాధిత కుటుంబాల్లోని చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటీఐలు పూర్తి చేసినా కాంట్రాక్ట్ కింద డైలీ లేబర్లుగా తీసుకుంటున్నారు. ఏపీ నుంచి వస్తున్న యువతకు మాత్రం ఇక్కడి కంపెనీల్లో పర్మనెంట్​ కొలువులు ఇస్తూ, తెలంగాణ యువతను మాత్రం కూలీలుగా మారుస్తున్నారు. 

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలంలో స్పెషల్​ఎకనమిక్​ జోన్(సెజ్)ను 2007లో ఏర్పాటు చేశారు. దీని కోసం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, బాలానగర్​ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 282 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి 950 ఎకరాలు ఏపీఐఐసీ సేకరించింది. పరిహారం సరిపోవట్లేదని బాధితులు ఆందోళన చేయడంతో అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లోని చదువుకున్న యువకులకు కంపెనీల్లో పర్మనెంట్​ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. పోలేపల్లిలోని బాధితులకు 134, ముదిరెడ్డిపల్లెలో 33 కుటుంబాలకు అప్పటి కలెక్టర్ ​జాబ్​కార్డులు జారీ చేశారు. మరో 115 కుటుంబాలకు సెజ్​లోని కంపెనీల్లో రెగ్యులర్​ బేసిస్ ​కింద ఉద్యోగాలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. జాబ్​ కార్డులు ఇచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఒక్కరికీ పర్మనెంట్​ ఉద్యోగం ఇవ్వలేదు. 

లేబర్లుగానే తీసుకుంటున్నరు

సెజ్​లో మొత్తం 42 కంపెనీలు ఉండగా ప్రస్తుతం 36 నడుస్తున్నాయి. ప్రస్తుతం 282 భూ బాధిత కుటుంబాల్లో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఇంజనీరింగ్​చదువుకున్న యువకులు దాదాపు 620 మంది వరకు ఉన్నారు. వీరిలో 180 మంది ప్రస్తుతం ఇక్కడి కంపెనీల్లో డైలీ లేబర్లుగా ప్యాకర్లు, స్వీపర్లు, ఫిట్టర్లు, డ్రైవర్లు, వేర్​హౌస్, ప్రొడక్షన్, హౌస్​కీపింగ్, గార్డెనింగ్ పనులు చేస్తున్నారు. వీరికి రోజుకు రూ.350 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీలోని వైజాగ్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, యూపీ, జార్ఖండ్​, ఒడిశా నుంచి వచ్చే వారికి రెగ్యులర్​ పోస్టులు ఇస్తున్నారు. వీరిలో ట్రైనింగ్​ టీఏలకు నెలకు రూ.18 వేల చొప్పున ఏడాదికి రూ.2.16 లక్షలు, సూపర్​వైజర్లకు నెలకు రూ.20 వేల చొప్పున ఏడాదికి రూ.2.40 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. పోలేపల్లికి చెందిన యువతకు మాత్రం నెలకు కనీసం రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదు. డైలీ లేబర్లు కావడంతో పని చేసిన కాలానికే  పైసలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఈ ప్రాంతంలోని మహిళలు కూడా కంపెనీల్లో బాత్​రూమ్​లు కడకడం, జాడు కొట్టడం, కాల్వలు తీయడం వంటి పనులు చేస్తున్నారు. వీరికి డైలీ లేబర్​ కింద రోజుకు రూ.250 మాత్రమే చెల్లిస్తున్నారు. 

లేబర్​ కాంట్రాక్టర్లుగా టీఆర్​ఎస్​ లీడర్లు

టీఆర్ఎస్​ పార్టీకి చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర లీడర్లు లేబర్​ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. వీరు సెజ్​లోని కంపెనీలతో టై అప్ ​అవుతున్నారు. కంపెనీలకు లేబర్లు అవసరమైతే వీరే పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, మాచారం నుంచి సమకూరుస్తున్నారు. కంపెనీల మేనేజర్లు లేబర్లకు డైరెక్ట్​గా కూలి పైసలు చెల్లించకుండా, కాంట్రాక్టర్లుగా ఉన్న టీఆర్ఎస్​ లీడర్ల అకౌంట్​లో వేస్తున్నారు. కాంట్రాక్టర్లు నెలనెలా లేబర్లకు చెల్లించేటప్పుడు ఐదు రోజుల పైసలను పట్టుకొని మిగతావి  ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పనుల్లో నుంచి తీసేయిస్తున్నారు. కంపెనీలు కూడా ఇవే రూల్స్​ ఫాలో అవుతూ కూలీలను దోపిడీ చేస్తున్నాయి.

పోలేపల్లికి చెందిన మహేశ్​ తాత వెంకయ్యకు సర్వే నంబర్​458లో ఎకరా భూమి ఉండేది. ఈ భూమిని సెజ్​ కోసం తీసుకున్నారు. రూ. 70 వేల పరిహారంతో పాటు చదువుకున్న యువకులకు ఉద్యోగం ఇస్తామని జాబ్​కార్డు ఇచ్చారు. ఎనిమిదేళ్ల కిందట మహేశ్ ​ఇంటర్ పూర్తి చేశాడు. ఈయన తమ్ముడు నరేశ్​ ఐటీఐ ఎలక్ట్రీషియన్​ కోర్సు చేశాడు. వీరిద్దరిలో ఒకరికి కూడా సెజ్​ కంపెనీల్లో రెగ్యులర్​జాబ్​ రాలేదు. మహేశ్ కొన్ని రోజులు అరబిందో కంపెనీలో డైలీ లేబర్​గా రూ.350కి పని చేసి మానేశాడు.

పోలేపల్లి గ్రామానికి చెందిన డి.కృష్ణయ్య బీటెక్​ చదువుకున్నాడు. తండ్రి పెంటయ్యకు సర్వే నంబర్​ 458లో ఉన్న రెండు ఎకరాల భూమిని సెజ్​ కోసం తీసుకున్నారు. వీరి కుటుంబానికి కూడా జాబ్​ కార్డు ఇచ్చారు. కానీ ఇంతవరకు కృష్ణయ్యకు రెగ్యులర్ జాబ్ ఇవ్వలేదు. కృష్ణయ్య అరబిందో కంపెనీలో ట్యాబ్​లెట్ల లోడింగ్,​ అన్​లోడింగ్​ పనులు చేసేవాడు. ఆయన పైస్థాయిలో ఉన్నవారు తరచూ హేళన చేస్తుండటంతో అక్కడ పని మానేశాడు. 

పర్మనెంట్​ చేస్తలేరు

సర్వే నంబర్​ 458లో మూడున్నర ఎకరాలు సెజ్​కోసం తీసుకున్నరు. జాబ్​కార్డు ఇచ్చినరు. కానీ నా కొడుకు రవి చనిపో యిండు. కోడలు చెన్నమ్మ ఎంజీఆర్ఎం కంపెనీలో డైలీ లేబర్​గా కాలువలు తీయడం, బాత్​రూమ్​లు కడగటం వంటి పనులు చేస్తోంది. రోజుకు రూ. 250 కూలి ఇస్తున్నరు. కూలి సరిపోతలేదని, పెంచాలని చెబుతున్నా పట్టించు కుంటలేరు. రెగ్యులర్​ ఉద్యోగం ఇస్తలేరు.
- కర్రె గౌరమ్మ, పోలేపల్లి

టీఎస్​ఐఐసీలోకి మారినా.. పరిస్థితి మారలె

ఏపీఐఐసీ నుంచి సెజ్​ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ​ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​(టీఎస్ఐఐసీ)లోకి చేరింది. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్​ ఉన్నారు. అయితే కొలువుల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. రైతు కుటుంబాలకు జాబ్​ కార్డులు ఇచ్చినా ఇప్పటికీ కొలువులు ఇవ్వడం లేదు. ఈ విషయంపై కంపెనీల వద్ద బాధితులు ఆందోళన చేస్తున్నారు. కంపెనీల మేనేజర్లు మాత్రం మంత్రి కేటీఆర్ ​దగ్గర చెప్పుకున్నా ఏం చేయలేరని సమాధానం ఇస్తున్నారని యువకులు చెబుతున్నారు. కంపెనీల్లో పర్మనెంట్ ​ఉద్యోగాల కోసం స్థానిక టీఆర్ఎస్​ లీడర్లను కలిసినా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు.