జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం: డిప్యూటీ సీఎం భట్టి

జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం: డిప్యూటీ సీఎం భట్టి
  • తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్​ లెటర్స్: డిప్యూటీ సీఎం భట్టి
  • ప్రభుత్వం నుంచి రూ.6,250 కోట్లు సబ్సిడీ
  • లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
  • సమన్వయం కోసం నోడల్​ ఆఫీసర్​ను నియమించాలి
  • ఎస్​ఎల్​బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ  ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.  గురువారం హైదరాబాద్‌‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్​ఎల్​బీసీ) సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజీవ్​ యువ వికాసం స్కీమ్ కోసం రూ.9 వేల కోట్లు  కేటాయించగా, రూ. 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నదని తెలిపారు. 

గతంలో 70% రుణం, 30% సబ్సిడీ ఉండగా.. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లను కోరారు.  యువత మేధస్సును ఉత్పత్తి రంగంలో వినియోగించి జీడీపీకి ఉపయోగపడేలా ఈ పథకం రూపొందించామని, దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ లేదని భట్టి అన్నారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.

 స్కిల్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతోపాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ ద్వారా నైపుణ్యం గల యువతను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వైపు దేశం చూస్తున్నదని, దీనికి అవసరమైన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను కల్పిస్తున్నామని తెలిపారు. 

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం

రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పంటలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. 2 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేశామని, రైతు బీమా ప్రీమియంలను ప్రభుత్వమే చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. అడవి బిడ్డల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రూ.12,600 కోట్లతో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా 6.7 లక్షల ఎకరాల అటవీ భూమిని సౌర విద్యుత్తుతో సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

 స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలతోపాటు వ్యాపార అవకాశాలు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నామని వివరించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. సామాజిక బాధ్యతలో బ్యాంకర్లు ముందుండాలని, ప్రభుత్వ- బ్యాంకింగ్ రంగాలు కలిసి సమాజ శాంతి, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2025-–26 రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు భాగస్వాములు కావాలని అన్నారు.