రాజకీయ​ పార్టీల్లో యువ నాయకత్వం

రాజకీయ​ పార్టీల్లో యువ నాయకత్వం

చరిత్ర తెలిసినప్పటి నుంచి మనిషి శాశ్వతంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూర్వం చక్రవర్తులు తాము శాశ్వతంగా జీవించడానికి ‘సంజీవని’ ఎక్కడైనా ఉంటే కనిపెట్టాలని పండితులను ఆజ్ఞాపించేవారు. మనిషి ఎప్పుడూ మరణాన్ని నివారించాలని, దేవుండ్లలా ఎల్లకాలం జీవించాలని కోరుకుంటాడు. కానీ ఇప్పటి వరకు శాశ్వతంగా జీవించడం సాధ్యపడుతుందని ఎక్కడా కనుగొనలేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే.. కొత్తగా యువతకు ప్రాధాన్యం ఏమీ ఉండదు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో నాయకుల తుది దశలో వారి తదనంతరం వారసులను పరిచయం చేస్తారు. ఒకప్పుడు భారతదేశాన్ని రాజులు పరిపాలించారు. సహజంగానే, భారతదేశం ఆ ఆచారాల్లో కొన్నింటిని స్వీకరించింది. రాజు కుమారుడు రాజు అయ్యాడు.

 రాజవంశాలను అప్పటి ప్రజలు అంగీకరించక తప్పలేదు. కానీ ఇప్పుడు దేశంలో.. తమిళనాడు సీఎం స్టాలిన్ తన తండ్రి కరుణానిధి వారసుడు, థాక్రే వారసుడిగా థాక్రే, శరద్ పవార్ వారసురాలి సుప్రియా సూలే, కాంగ్రెస్​పార్టీ వారసుడిగా రాహుల్ గాంధీ ఇంకా చాలా రాష్ట్రాల్లో వారసులు కొనసాగుతున్నారు. బీజేపీకి కూడా అనేక రాజవంశాలు ఉన్నాయి. కానీ వారు పార్టీని నియంత్రించరు. రాజవంశాలు పోవాలని, అధికారానికి యోగ్యత మాత్రమే షరతు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందులో భాగంగానే బీజేపీ, మోడీ దేశ రాజకీయాల్లో యువ నాయకుల ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. పొలిటికల్​సీన్‌‌ నుంచి వెళ్లిపోతే బీజేపీ పతనం కాకూడదని మోదీ భావిస్తున్నారు. ఆయనకు ముందు అటల్ బిహారీ వాజ్‌‌పేయి, అద్వానీ1980 నుంచి 2014 వరకు బీజేపీకి నేతృత్వం వహించినా.. వారికి వారసత్వ ప్రణాళిక లేదు.

పార్టీలకు యువ రక్తం కావాలి

రాజకీయ పార్టీల మనుగడకు కొత్త రక్తం కావాలి. బెంగాల్‌‌లోని సీపీఎం దీనికి ఉత్తమ ఉదాహరణ. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య1977 నుంచి 2011 వరకు కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరూ అత్యంత ప్రతిభావంతులు. 2011లో సీపీఎం అక్కడ కూలిపోయింది. 34 ఏండ్లుగా పార్టీలోకి కొత్త రక్తం రాలేదు. ఆ పాత నాయకులే  సీపీఎంపై ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా ఆ పార్టీ తెరమరుగైంది. అలాంటి పరిస్థితి తమ పార్టీకి రావొద్దని మోదీ 2014 నుంచే ఇతర పార్టీల నుంచి ఆసక్తి చూపే ప్రతిభావంతులైన యువనాయకుల కోసం ఓపెన్​డోర్​విధానం అవలంబిస్తున్నారు.  

వివిధ రాష్ట్రాల్లో యువనాయకత్వం

అస్సాంలో యువ నాయకుడు హిమంత బిశ్వ శర్మను పార్టీలో చేర్చుకోగా.. ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగాడు. మిగతా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువ నాయకులు బీజేపీలో చేరడంతో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పవర్‌‌ పెరిగింది. బెంగాల్‌‌లో బీజేపీకి స్థిరపడి న నాయకులు లేరు. బీజేపీ నేతలంతా రాజకీయాలకు కొత్తవారే. అందుకే బెంగా ల్‌‌లో మమతా బెనర్జీకి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మహారాష్ట్రలో, కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ లేదా శివసేనలో పదవులు పొందని యువ నాయకులను బీజేపీ చేర్చు కుంది. తెలంగాణాలో కూడా బండి సంజయ్​సహా కొత్త యువ నాయకులను ప్రోత్సహిం చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి శక్తివంతమైన నాయకులను చేర్చుకున్నది. బీజేపీకి ఇక్కడ యువ రక్తం పెరిగింది. తమిళనాడులో మాజీ ఐపీఎస్ అధికారి అయిన కె. అన్నామలై కూడా బీజేపీ యువరక్తానికి మంచి ఉదాహరణ. 

డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌‌లతో పోలిస్తే బీజేపీకి అత్యంత పిన్న వయస్కులైన నాయకత్వం లభించింది. తమిళనాట బీజేపీలో చైతన్యం పెరిగింది. డీఎంకేలో 35 ఏండ్ల క్రితం నాయకత్వం మొత్తం కరుణానిధి వెంట ఉండేది. అలాగే కేరళలో కాంగ్రెస్ నాయకుడు ఏకే కుమారుడు అనిల్ ఆంటోనీ ఇటీవల బీజేపీలో చేరారు. ఇతర పార్టీల్లో రాజకీయ అవకాశాలు లేని యువ నేతలను ఆకర్షించేందుకు కేరళలో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలను కూడా తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ తాజాగా బీజేపీలో చేరారు. బీజేపీ ముస్లిం మహిళలపై దృష్టి సారిస్తోంది. ఇది పూర్తిగా పార్టీలోకి కొత్త రక్తం. నిజానికి అలీగఢ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ లాంటి వారు బీజేపీలో చేరతారని ఊహించలేం. 

కుటుంబ పార్టీల్లో మరోలా..

కుటుంబ పార్టీలకు కొత్త రక్తం ఎలా వస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు.. వాళ్లు వారి వారసులను, బంధువులను తర్వాతి యువ నాయకులుగా పార్టీలో పరిచయం చేస్తారు. డీఎంకే, కాంగ్రెస్, శరద్ పవార్, శివసేన, బీహార్‌‌లో లాలూ ప్రసాద్, ఉత్తరప్రదేశ్‌‌లో అఖిలేష్ యాదవ్, పంజాబ్‌‌లోని అకాలీదళ్, బెంగాల్‌‌లో మమతా బెనర్జీ యువ బంధుత్వాలను తెరమీదకు తెస్తున్నారు. ఇది కొంతకాలం పని చేస్తుంది. కుటుంబ పార్టీలు కొంతకాలం తర్వాత కనుమరుగైపోతాయి. ఒకప్పుడు డీఎంకే 55% ఓట్ షేర్ కలిగి ఉండేది. ఇప్పుడు 25 శాతానికి పడిపోయింది. ఎప్పుడైతే కుటుంబ పార్టీలు దెబ్బతిని, తెరమరుగయ్యే పరిస్థితి వస్తుందో.. మిత్రపక్షాలతో జతకడుతుంటాయి. 

తెలంగాణలో కూడా మిత్రపక్షాల కోసం బీఆర్ఎస్ వెతుకుతోంది. కొత్త రక్తం లేని అన్ని పార్టీలలో క్షీణత ఉంది. 1974 నాటికి ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ వేగంగా తెరమరుగైంది.1975 తర్వాత ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌‌గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశిం చి లక్షలాది మంది యువకులను చేర్చుకుని కాంగ్రెస్‌‌కు పూర్వవైభవం తీసుకొచ్చారు. కాంగ్రెస్‌‌ను పునరుద్ధ రించింది రాజీవ్ గాంధీ లేదా సోనియా గాంధీ కాదు. సంజయ్ గాంధీ తర్వాత, ఆ స్థాయిలో కాంగ్రెస్‌‌లో కొత్త రక్తం ప్రవేశిం చకపోవడంతో కాంగ్రెస్‌‌లో క్షీణ దశలోనే ఉన్నది. భారీ సంఖ్యలో కొత్త నేతలను చేర్చుకునేందుకు బీజేపీ కచ్చితంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే అన్ని పార్టీలలో కొత్త బయటి వ్యక్తులకు, పాతవారికి సహజంగానే ప్రతిఘటన ఉంటుంది. ఈ ప్రతిఘటనను మోదీ అధిగమించగలరా?

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్