రాజ్యాంగబద్ధ పాలకులవ్వండి!

రాజ్యాంగబద్ధ పాలకులవ్వండి!

బుద్ధుడి హృదయంతో నిర్మితమైన భారత రాజ్యాంగం. మనకు మనం సర్వోన్నతమైన సార్వభౌమంగా ఆమోదించుకున్నాం. ప్రజల మేలుకు ఎంతైనా మెల్ట్ అయ్యే స్వభావం కలది మన రాజ్యాంగం. కాలానుగుణంగా మార్పును స్వాగతిస్తుంది. ఉత్కృష్ట కాలంలో కూడా ఉపశమనం ఇచ్చే నీతిగల విలువలు మన రాజ్యాంగం సొంతం. భారత రాజ్యాంగం  పరిధిలోకి  అన్నలు రావాలి. ఇలాంటి వారు అడవిలో చెట్టుకొమ్మ  కింద కాదు, రాజ్యాంగపు కమ్మ కింద ఉండాలి. మీ త్యాగం వెలకట్టలేనిది, మీ పోరాటం  కొలవలేనిది. మీలాంటి వారినే పాలకులుగా రాజ్యాంగం కోరుకుంటుంది. 

బలహీనమైన పల్లె

పల్లెకు పట్నాలు చాలా దగ్గరయ్యాయి. పట్నం అల్లరి పల్లెలో తిష్ట వేసి కూర్చున్నది. గుట్కా, గంజాయి మత్తులో యువత తూలుతున్నారు.  నైతికత లోపించి విచ్చల విడితనం పెరిగింది. మత్తును దూరం చేసే ప్రయత్నాలు ఎవ్వరూ చేయరు. అలా చేస్తే ఓటు బ్యాంక్ తగ్గిపోతోందని, వీరికి స్పృహ వస్తే పాలకుల గిమ్మిక్​ సాగదని మరింతగా యువతను  బిజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  పార్టీలపరంగా  గ్రామం విభజనకు గురైంది. దీంతో  దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు బలహీనతతో  కొట్టుమిట్టాడుతున్నాయి.

మీ రాక కోసం ఎదురుచూపులు

కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. ఎన్నడూ  లేనంతగా  టెక్నాలజీ  రోజు రోజుకూ పెరిగిపోతోంది.  అడవిలో పిట్టలుగా రాలుతున్న దృశ్యాలను చూసి, గాలిలో మీ రూపును ఊహించుకొని ఏండ్లుగా అనాథలైన బిడ్డలు రోదిస్తున్నారు. బిడ్డలు లేని తల్లుల కన్నీటిలో రక్తం  స్రవిస్తోంది.  ఒక్క చేతి ముద్దైనా  మీకు తినిపించాలని కన్నతల్లి,  మీ ఒళ్లో కూర్చొని ఒక్క ముద్దైనా తినాలని మీరు కన్నబిడ్డలు ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు.

సమాజాన్ని పెన్నుతో సిజేరియన్ చేయండి

పార్టీలపరంగా పనులు చేయటం. మిగతా వారిని కాదనడం. ఒకరి తరువాత మరొకరు అధికార జులుం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో వారికంటూ ఓ ధైర్యాన్ని కోరుకున్నపుడు,  తిరిగొస్తున్న అన్నలను చూసి ప్రజలు ఎంతో సంబురపడిపోతున్నారు. రక్తం బొట్టు చిందించకుండా  రాజ్యపథం  చేపట్టండి అన్నా.  అంబేద్కర్ ఆలోచనల్ని ఆచరిద్దాం. నిత్యం పోరాటాలతోనే జీవితం ముగుస్తున్నది. అస్థిరత్వ ఆలోచనలలో కొట్టుకుపోతోంది సమాజం. ఇప్పుడు ఈ సమాజాన్ని మీరు పెన్నుతో  సిజేరియన్  చేయాలి.

బులెట్ నుంచి  బ్యాలెట్​కురండి 

మీరు కోరిందే... రాజ్యాంగం కోరింది. రాజ్యాంగం కోరింది మీ లక్ష్యంలో ఉన్నది. అట్టడుగు వర్గాలు కూడా నెత్తురు రాల్చకుండా పాలకులయ్యే మహత్తర బ్యాలెట్ విధానాన్ని జాంబవ మహారాజ్ రూపొందించాడు.  ఇప్పుడా బ్యాలెట్ గర్భంలోంచి రాజులుగా పురుడోసుకోండి.  మీ సేవలనే  దేశం కోరుకుంటుంది. మీలాంటి నికార్సైన వారినే రాజ్యాంగం ముద్దాడుతుంది. మీరు చట్టసభలలో పోటీ చెయ్యండి. గ్రామాలకు ప్రజాస్వామ్యయుత నాయకులవ్వండి.  బీద ప్రజల మేలు కోరేవారే మీరైతే స్థానిక ఎన్నికల్లో  పోటీ చెయ్యండి. లేదంటే మీ వనవాసంలో మాకు తెలియని మోసమేదో ఉందనే మేం నమ్ముతాం.

- శ్రీను కుశాలి