నిరాశపర్చిన కాప్ 30 సదస్సు

నిరాశపర్చిన కాప్ 30 సదస్సు

ప్రపంచ వాతావరణ 30వ సదస్సు బ్రెజిల్ దేశంలోని బెలెం నగరంలో ఇటీవల ముగిసింది.  ముందుగా నిర్ణయించిన నవంబర్  21వ తేదీ దాటి 30 గంటల తరువాత అధికారికంగా ముగించినా ఒక ఒప్పందానికీ రాకపోవడం  ప్రపంచవ్యాప్తంగా  చాలామందిని  నిరాశకు గురిచేసింది. అయితే,  ఆది నుంచి విభిన్న అభిప్రాయాలతో అక్కడికి చేరుకున్న198 దేశాలు కేవలం 11 రోజుల సమావేశంలో అనుకున్న ఎజెండా మేరకు ఒప్పందానికి రావడం దుర్లభం అవుతున్నది.  

దీనికితోడు  ప్రతి ఏటా ప్రభుత్వ, ఇతర ప్రతినిధులలో కార్పొరేటు లాబీల ప్రతినిధుల సంఖ్య పెరగడంతో పరిష్కారాలలో తమ  ప్రయోజనాల రక్షణలో విస్తృత ప్రపంచ ప్రయోజనాలు వెనుకబడిపోతున్నాయి. జాతీయ,  కార్పొరేటు వ్యాపార ప్రయోజనాలు మిళితమైన పరిష్కారాలను  రుద్దే  ప్రయత్నాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.  మానవ కార్యకలాపాల వలన, నిరంతర శిలాజ ఇంధనాలను మండించడం వల్ల, వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి పెరిగిపోయి, పుడమి వాతావరణం క్రమంగా వేడి ఎక్కుతున్నది. 

పుడమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణం తీవ్ర మార్పులకు లోనవుతున్నది.  ఈ మార్పులు అనూహ్య స్థితికి చేరుకొని ఊహించలేని ప్రకృతి ఉత్పాతాలను కలుగజేస్తున్నవి.  ఉష్ణోగ్రతల వల్ల ఆర్కిటిక్ వంటి శీతల ప్రాంతాలలో శతాబ్దాలుగా పేరుకున్న మంచు కరిగి సముద్రాల నీటి మట్టం పెరిగి తీరప్రాంతాల నివాసితులను నిర్వాసితులను చేస్తున్నది.  సముద్ర జలాల వేడి పెరిగి అనేక రకాల జలచరాల జీవ వైవిధ్యం నశిస్తున్నది. 

ఈనేపథ్యంలో  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కాలుష్యం గుర్తించినా వాటిని తగ్గించడానికి ఏకాభిప్రాయ సాధనకు ఆది నుంచి ప్రపంచ వాతావరణ సదస్సులు వేదికగా మారినాయి. 1995లో  మొట్టమొదటి ప్రపంచ వాతావరణ సదస్సు జరగగా దాదాపు ప్రతి ఏటా ఒక్కొక్క దేశంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 30 దేశాలలో  సదస్సులు నిర్వహించారు. 

నిరాశజనకంగా ఫలితాలు

ప్రతి దేశం ప్రకటించిన కాలుష్యాన్ని తగ్గించే చర్యల ఫలితాన్ని శాస్త్రీయంగా అంచనా వేశారు. కానీ, ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అయితే ఇటీవల బేరీజు వేస్తే కాలుష్య ఉద్గారాల పెరుగుదల రేటులో కొంత మార్పు వచ్చినట్టు, కొంతమేర తగ్గినట్టు వార్తలు వచ్చాయి. పుడమి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు మించకుండా చేయాల్సిన ప్రయత్నాలు సరిపోవడం లేదు.  ఇంకా తీవ్రమైన చర్యలు చేపట్టాలని అనేక శాస్త్రీయ నివేదికలు చెబుతున్నాయి.  

కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను మండించడం తగ్గించాలని, ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని కాప్30 సదస్సులో ప్రయత్నాలు జరిగినాయి. కానీ, ఫలితం రాలేదు. శిలాజ ఇంధనాల ఉపయోగం తగ్గించడానికి అభివృద్ధి చెందిన, ధనిక దేశాలు కొంతమేర సానుకూలంగా ఉన్నా వర్ధమాన దేశాలు ఒప్పుకోవడం లేదు.  అమెరికా దేశం ఈసారి అసలే పాల్గొనలేదు. 

27 దేశాల ఐరోపా దేశాల కూటమి సానుకూలంగా ఉన్నది. అయితే, అమెరికా మద్దతుతో  సౌదీఅరేబియా దేశం, ఇంకా భారత్ సహా ఇతర దేశాలు ఈ ఒప్పందం ముందుకుపోకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ వితండవాదం చేశాయి. 82 దేశాలు సానుకూలంగా ఉండగా మిగతా దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చైనా కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నది.

పెరుగుతున్న ప్రతినిధుల సంఖ్య

ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. ఈ సంవత్సరం దాదాపు 58 వేల మంది పాల్గొన్నారు.  ఇది రెండో అతి పెద్ద సదస్సు. ఇదివరకు దుబాయిలో జరిగిన కాప్ 28 సదస్సులో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు.   

కాప్ 31 సదస్సు తుర్కియే దేశంలో నిర్వహిస్తారు. అయితే, చర్చలకు సారథ్యం ఆస్ట్రేలియా ప్రతినిధి చేపడతారు. ఈ రకమైన అరేంజిమెంటు కూడా కొత్తనే.  పసిఫిక్ ద్వీప దేశాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో కాప్31 సదస్సుకు  ముందు ఒక సమావేశం 11 ద్వీపాలలో ఒక దాంట్లో నిర్వహించాలని నిర్ణయించారు.  2025 వాతావరణ మార్పుల సదస్సు క్లిష్ట నేపథ్యంలో జరిగింది.  

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. 2024 అత్యంత వెచ్చని సంవత్సరంగా నిర్ధారించడమైనది.  పారిస్ ఒప్పందం కింద ప్రతి దేశం ఇవ్వాల్సిన మూడవ దశ ప్రణాళికలు (ఎన్డీసీలు) ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా సమర్పించారు.  అనేక దేశాలు ఇంకా తమ ప్రణాళికలను పూర్తిగా సమర్పించలేదు. కేవలం 121 దేశాలు ఇచ్చాయి.  అమెరికా పారిస్ ఒప్పందం నుంచి వైదొలగింది.  పారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడానికి ఆశించిన జాతీయస్థాయి చర్యలు  సమష్టిగా పుడమి ఉష్ణోగ్రత తగ్గిస్తాయనే ఆశ సన్నగిల్లింది. 

క్రమంగా తుంగలోకి అధ్యయన సూత్రాలు

 కాప్ 30 సదస్సు అధ్యక్ష బృందం ప్రత్యేక సంప్రదింపులను  నిర్వహిస్తుందనే హామీ మేరకు సదస్సు ప్రారంభమయ్యింది.  ఈ  సంకలిత సంప్రదింపులతో కూడిన ఒక చివరి నిర్ణయం వెలువడుతుంది అని కూడా హామీ వచ్చింది. ఈ నిర్ణయంలో శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించడానికి ఒక మార్గదర్శక విధానం కూడా ఉంటుంది అని స్వయంగా బ్రెజిల్ ఆధ్యక్షుడు ముందే ప్రకటించారు. 

అటవీ నిర్మూలన కార్యకలాపాల మీద కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంటుందని కూడా వాగ్దానం చేశారు.  చివరికి, మ్యుచిరో ( ఐకమత్యంగా అని పోర్చుగీస్ భాషలో అర్థం) నిర్ణయంగా ప్రకటించిన  సదస్సు తీర్మానం ఇవేవి లేకుండా శుష్క పదాలతో ముగించేశారు. ప్రపంచ వాతావరణ సదస్సు  మొదట్లోనే  శాస్త్రీయ నివేదికలు, అధ్యయనాల ఆధారంగా కొన్ని సూత్రాలను అవలంబించింది. ఆ సూత్రాలను క్రమంగా తుంగలోకి తొక్కుతున్నారు.  

కాలుష్యం చేసినవారు పరిహారం కట్టాలి, ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా మానవ కల్పిత చర్యలు జాగ్రత్తగా చేపట్టాలి.  ఏదేమైనా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న సంప్రదాయ వర్గాలకు ఆధునిక సమాజం భూతాపం పట్ల స్పందనకు చేస్తున్న రాద్ధాంతం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. బస్సులో సీటులో కూర్చున్నవారు బస్సు నడవకుంటే  తోయడానికి  నిలుచున్నవారి బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

తాము లేచి బస్సును తోస్తే తమ సీటు పోతుంది అనే భయం కూడా ఉన్నది.  కొన్ని దేశాలు, ప్రపంచంలో మొత్తం 50 శాతం మీద ఆధారపడి జీవిస్తున్న కేవలం ఒకశాతం ధనికులు  ఆర్థిక వ్యవస్థలో తమకు సమకూరిన సౌకర్యాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు.  పుడమి  ఉష్ణోగ్రతను ఎదుర్కోవడానికి తమ దగ్గర సాధనాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు.   మొత్తం నాశనం అయినా తమ ప్రస్తుత విలాస జీవితం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు.  ఈ రకమైన వైఖరి ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రస్ఫుటం అవుతున్నది. చర్చల పురోగతిని బలహీనం చేస్తున్నది.

కాప్​ 33 భారతదేశంలో...

మన దేశంలో  కాప్​ 33 నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా వారి ఆమోదం రాలేదు.  ఏ దేశంలో నిర్వహిస్తే ఆ దేశం మొత్తం ఖర్చు భరిస్తుంది. ఆ సదస్సులో తనదైన ముద్ర వేసుకునే అవకాశం కూడా ఆ దేశానికి లభిస్తుంది. ఈజిప్ట్ దేశంలో జరిగిన కాప్ 27 సదస్సులో ఆఫ్రికన్  దేశాలు కలిసికట్టుగా పట్టుబట్టి వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న దేశాలకు పరిహారం ఇవ్వడానికి ఒక నిధి ఏర్పాటును సాధించాయి. 

లాస్ అండ్ డామేజీ  నిధి ఏర్పాటుకు అన్ని దేశాలు ఒప్పుకోవాల్సి వచ్చింది.  అతి పెద్ద నిర్ణయం పారిస్ నగరంలో జరిగిన  కాప్ 15 సదస్సులో వెలువడింది. అప్పటివరకు కాలుష్యం తగ్గించాలని ఎవరికివారు వెనుకడుగు వేస్తున్న దశలో ప్రతి దేశం తాను సొంతంగా ఏమేరకు తగ్గిస్తుందో చెప్పాలని ఒక ఒప్పందం జరిగింది. స్వతహాగా ప్రతి దేశం ఒక కాలపరిమితిలో తమ దేశంలో కాలుష్యాన్ని తగ్గించే విధాన నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఒప్పందం నిర్దేశించింది. 

- డా.దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​