ఇది సుధాకర్ రెడ్డి పనే : వైఎస్ కుటుంబసభ్యుల అనుమానం

ఇది సుధాకర్ రెడ్డి పనే : వైఎస్ కుటుంబసభ్యుల అనుమానం

కడప : వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిలే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి ఉంటారని అనుకుంటున్నారు వైఎస్ కుటుంబసభ్యులు. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో ముద్దాయి రాగిపిండి సుధాకర్ రెడ్డి పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సుధాకర్ రెడ్డి… గత జూన్ నెలలో సత్ప్రవర్తన కారణంగా జైలు నుంచి విడుదలయ్యారు.

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన రాగిపిండి సుధాకర్‌రెడ్డి … 1998లో జరిగిన వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ మర్డర్ కేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించింది. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని జైల్ లో శిక్ష అనుభవించాడు సుధాకర్ రెడ్డి.

రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను రిలీజ్ చేసే సంప్రదాయంలో భాగంగా… క్షమాభిక్ష పేరిట 2018 జూన్ నెలలో సుధాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని గత జూన్ లో అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జైళ్ల నుంచి మొత్తం 47 మంది ఖైదీలు విడుదలయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి 18 మందికి, విశాఖ నుంచి 13 మందికి, అనంతపురం నుంచి ఆరుగురు, వైఎస్సార్‌ జిల్లాలో ఏడుగురు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఖైదీలకు క్షమాభిక్ష లభించింది.

అలా విడుదలైన సుధాకర్ రెడ్డి.. అధికార పార్టీ మద్దతుతో తమ కుటుంబసభ్యుడైన వైఎస్ వివేకాను హత్య చేసి ఉంటారని వైఎస్ కుటుంబసభ్యులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.