
- మా తాత, మా నాన్న, మా బాబాయి.. చంద్రబాబుహయాంలోనే చనిపోయారు
- మా కుటుంబంపై చంద్రబాబు కక్ష కట్టారు
- సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
పులివెందుల : మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గొడ్డలితో తలపై ఐదుసార్లు దాడిచేయడంతో వివేకా అక్కడికక్కడే చనిపోయారని జగన్ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులే చెబుతున్నారని అన్నారు. ఐతే… వివేకా రాసినట్టుగా ఉన్న ఓ లెటర్ ను పోలీసులు తనకు చూపించారని.. అన్నారు. లెటర్ లో ఓ డ్రైవర్ పేరు ఉందని.. ఇది పక్కాగా కేసును పక్కదారి పట్టించడమే అని అన్నారు.
బెడ్ రూమ్ లో దుండగులు వైఎస్ వివేకాను నరికి చంపిన తర్వాత… బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి… ప్రమాదవశాత్తూ చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేశారని అన్నారు వైఎస్ జగన్. బాత్రూమ్ లో మరకలను అంటించి.. మూర్చవచ్చి కిందపడి కొట్టుకున్నట్టుగా కమోడ్ కు రక్తాన్ని అంటించి ఓ డెత్ సీన్ ను సృష్టించారని అన్నారు.
దుండగులు గొడ్డలితో నరుకుతుంటే మా చిన్నాన్న చనిపోతూ ఆ లెటర్ రాస్తారు. పక్కాగా కేసును పక్కదోవ పట్టిస్తూ.. ఒక డ్రైవర్ పై నేరం నెట్టేందుకు ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు జగన్. నిజాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని… అంత తీవ్రమైన గాయాలైన వ్యక్తి లెటర్ ఎలా రాస్తాడని ప్రశ్నించారు. దుండగుల సమక్షంలో లెటర్ రాస్తుంటే హంతకులు చూస్తుండిపోతారా..? ఇదెంత దారుణం అన్నారు.
వైఎస్ వివేకాను అన్యాయంగా చంపారన్న అంశం పక్కకుపోయి.. కేసును పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు జగన్. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. సీబీఐ ఎంక్వైరీకి మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులతో, డీఐజీ, ఎస్పీతో మాట్లాడుతుండగా.. 2, 3 సార్లు అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ నుంచి ఫోన్లు వచ్చాయనీ… ఇంటలిజెంట్ గా కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
- మా తాత, మా నాన్న, మా బాబాయి.. చంద్రబాబుహయాంలోనే చనిపోయారు
- మా కుటుంబంపై చంద్రబాబు కక్ష కట్టారు
మా తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు.. మానాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి ముందురోజు చంద్రబాబు “అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అని తన తండ్రిని హెచ్చరించారని అన్నారు. వైజాగ్ లో తనపై కత్తిదాడి జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే అన్నారు. ఇపుడు వైఎస్ వివేకా హత్య కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. తమ కుటుంబానికి సంబంధించి ఏ సంఘటన చూసినా.. అందులో చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడని అన్నారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్ష కట్టారని… కుట్రపూరితంగా హత్యారాజకీయాలు చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీబీఐ విచారణలోనే నిజాలు బయటకొస్తాయనీ.. చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా బయటకు రావాలి.. శిక్ష పడాలని జగన్ డిమాండ్ చేశారు. పార్టీ కేడర్ సంయమనంతో ఉండాలని సూచించారు.