జనం డేటా దోచుకున్న చంద్రబాబే ఓ దొంగ, నేరస్తుడు : జగన్

జనం డేటా దోచుకున్న చంద్రబాబే ఓ దొంగ, నేరస్తుడు : జగన్

నెల్లూరు పట్టణంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారమే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీస్థాయిలో ఓట్లను తొలగించారని అన్నారు. “నా సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించారు. చంద్రబాబు తాను మోసాలు చేస్తూ ఎదుటివాళ్లను మోసగాళ్ళు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కలర్ ఫోటోలతో కూడిన ఎన్నికల డేటా… UIDAI డాటా చంద్రబాబు ప్రైవేట్ కంపెనీల్లో ఉంది. ఒక దొంగ, ఒక రాక్షసుడు, ఒక నేరస్తుడు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు” అని మండిపడ్డారు వైఎస్ జగన్.

చంద్రబాబు చేస్తున్నది చాలా తీవ్రమైన నేరమని జగన్ అన్నారు. జనం బ్యాంక్ అకౌంట్, ఆధార్ అన్ని వివరాలు చంద్రబాబుకు తెలుసనీ… ఇలాంటి దొంగను మనం ముఖ్యమంత్రి అని, అతని కొడుకును ఐటీ మంత్రి అని పిలవాల్సి వస్తోందని అన్నారు. ప్రజలకు సంబంధించిన డాటా.. ప్రైవేట్ కంపెనీల్లో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఎందుకు ఈ కంపెనీల యజమానులు చంద్రబాబుతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు అని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన కంపెనీలకు వత్తాసు పలికేందుకు ఏపీ పోలీసులను పంపించారని ఆరోపించారు. ఇంత చేసినా కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మనల్నే దొంగ అని చంద్రబాబు అంటున్నాడంటూ విమర్శించారు వైఎస్ జగన్.