టీచర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన షర్మిల

టీచర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన షర్మిల
  • టీచర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపిన షర్మిల
  • సూర్యాపేట నియోజకవర్గంలో షర్మిల 109వ రోజు పాదయాత్ర


సూర్యాపేట: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 109వ రోజు సూర్యాపేట  నియోజక వర్గంలో కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలను పలుకరిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. చివ్వెంల మండల కేంద్రంలో ఉపాధ్యాయుల ధర్నా శిబిరానికి హాజరై ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. ధర్నా శిబిరంలో కూర్చుని.. ప్లకార్డు పట్టుకుని టీచర్ల నినాదాలకు షర్మిల గొంతు కలిపారు. ఎన్ఈపీ రద్దు చేయాలని.. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని.. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు విద్యార్థులందరికీ వెంటనే అందజేయాలని ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళన న్యాయమైనదేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.  వైఎస్సార్ టీచర్ల పక్షాన నిలబడ్డారని, పిల్లల చదువు పట్ల వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధ చూపించారని గుర్తు చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేరుస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

109వ రోజు పాదయాత్రలో భాగంగా జరిగిన సభల్లో షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్.. టీఆర్ఎస్ పాలన తీరుపై మండిపడ్డారు. ‘‘వైఎస్ హయాంలో ఎన్ని పథకాలుండేవో గుర్తుందా..? ప్రవేశపెట్టిన ఏ పధకమైనా అద్భుతంగా అమలు చేసి చూపిపంచారు.. ఇప్పుడెన్ని ఉన్నాయి.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఉందా..? ఆరోగ్యశ్రీ ఉందా..? రుణ మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా..?  కేజీ టు పీజీ ఉచిత విద్య.. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా..?.. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా.. ? పోడు భూములకు పట్టాలిచ్చాడా..? దళితులకు మూడెకరాలు ఇచ్చాడా.. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా..? ఉచిత ఎరువులు అన్నాడు.. ఇచ్చాడా..? అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను తెచ్చేందుకే పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తున్నాను.. పార్టీ కొత్తదే కావచ్చు.. కానీ వైఎస్ బిడ్డగా వచ్చాను.. వైఎస్ ను గుర్తు చేసేలా అంతే అద్భుతంగా పాలన అందిస్తా..’’ షర్మిల హామీ ఇచ్చారు.