మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

కల్వకుర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాపై కేసీఆర్​ది సవతి తల్లి  ప్రేమ అని వైఎస్సార్​టీపీ చీఫ్ ​షర్మిల అన్నారు. సోమవారం ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కల్వకుర్తి  బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. భారీ వర్షంలోనే ప్రసంగించారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ఉచిత ఎరువులు.. ఇలా అనేక హామీలిచ్చిన ఆయన  ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తే యూనియన్లే లేకుండా చేశారన్నారు.  పదుల సంఖ్యలో  వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్​లో చలనం రావడంలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కన్పిస్తున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.

బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా మార్చారని, చివరకు మద్యం డబ్బులతోనే రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి దిగజారారని విమర్శించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఫైరయ్యారు. అప్పులు తెచ్చి కమీషన్ల రూపంలో మింగేశారని, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కన్పించడం లేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వైఎస్సార్​హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయని, కేసీఆర్ ​కొత్తగా చేసిందేమీ లేదన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  తీరు.. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరికిందనే సామెతలా ఉందన్నారు. పేదల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వందల కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస రెడ్డి, నరసింహ గౌడ్, అర్జున్ రెడ్డి, పుట్ట శేఖర్ పాల్గొన్నారు.