తినే ఆహారంలో వానపాములు, బల్లులు, బొద్దింకలా?

తినే ఆహారంలో వానపాములు, బల్లులు, బొద్దింకలా?

చదువుకోవడానికని విద్యార్థులను హాస్టళ్లకు పంపిస్తే... విషపు కూడు పెట్టి వాళ్లను చంపుతున్నారని కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఊర్లల్లోని హాస్టళ్ల వరకు... ఎక్కడా చూసిన విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు, ఎలుకలు రావడం దారుణమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో వందల మంది, మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది, సిద్ధిపేట సంక్షేమ హాస్టల్ లో 22 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారని తెలిపారు.

విష ఆహారం తిని ఇప్పటికే ఓ విద్యార్థి చనిపోయారన్న ఆమె... అయినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రభుత్వం హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు కనీసం అన్నం పెట్టేందుకు బరువవుతుందా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.