చిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

చిత్తశుద్ధితో పని చేస్త..  పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. 2021 జులైలో తెలంగాణ వేదికగా వైఎస్సార్ టీపీని షర్మిల స్థాపించారు. గత బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై ఆందోళనలు చేశారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే ప్రజా వ్యతిరేక ఓటు చీలి, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు షర్మిల అప్పట్లో ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ నెల 4న తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 

రుద్రరాజుకు కీలక పదవి.. 

ఏపీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించిన గిడుగు రుద్రరాజుకు హైకమాండ్ కీలక పదవి ఇచ్చింది. పార్టీలో అత్యున్నత కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయనను నియమించింది. కాగా, షర్మిల రాకతో పదవిని వీడేందుకు తాను సిద్ధమని రుద్రరాజు గతంలోనే ప్రకటించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని చెప్పారు.

చిత్తశుద్ధితో పని చేస్త :  షర్మిల

ఏపీలో కాంగ్రెస్​కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని షర్మిల అన్నారు. సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మాణిక్కం ఠాగూర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్ ’ వేదికగా పోస్టు పెట్టారు. ఏపీలో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు స్టేట్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఇతర నేతలు సహకరించాలని కోరారు.