ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు పదవీకి రాజీనామా సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. షర్మిల పార్టీలో చేరే సమయంలోనే పదవీ వీడేందుకు సిద్దమని రుద్రరాజు ప్రకటించారు. షర్మిల ఇటీవల తన పార్టీ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. త్వరలో  ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్  పార్టీని బలోపేతం చేసే కీలక బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీకి అప్పగించింది. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసి పాదయాత్ర చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు అక్కడ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్టీపీ నుంచి అభ్యర్థులెవరినీ బరిలోకి దింపలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల కేసీఆర్ మళ్లీ గద్దెనెక్కే ప్రమాదం ఉందని భావించే పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు షర్మిల ప్రకటించారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 

ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం, రాహుల్, సోనియాలను కలిశారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎక్కడ బాధ్యత ఇస్తే అక్కడ పనిచేసేందుకు సిద్ధమని, రాహుల్ గాంధీనికి ప్రధాన మంత్రిని చేయాలని తన తండ్రి దివంగత వైఎస్సార్  కలలు కన్నారని, వాటిని సాకారం చేసేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ఈ పరిణామాల అనంతరం ఇవాళ ఏఐసీసీ వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. 


ఇద్దరూ మహిళలే


ఆంధ్రప్రదేశ్​ లో రెండు జాతీయ పార్టీల స్టేట్ చీఫ్ లుగా మహిళే ఉన్నారు. అంతకు ముందు బీజేపీ అధినాయకత్వం పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. ప్రస్తుతం షర్మిలను కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా ప్రకటించింది. దీంతో ఏపీలో రెండు జాతీయ పార్టీలకు మహిళలే అధ్యక్షురాళ్లుగా ఉండటం, వారి హయాంలోనే ఎన్నికలు జరగనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 
 

కాంగ్రెస్ హైకమాండ్ కు థ్యాంక్స్: షర్మిల


తనకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనపై ఉంంచిన అచెంచెలమైన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని, అందరి సహకారంతో ముందుకు సాగుతానని చెప్పారు. మాణిక్కం ఠాగూర్ గారి మార్గదర్శనంలో, గిడుగు రుద్రరాజు సహకారంతో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఇటీవ‌ల ష‌ర్మిల రాహుల్‌, ఖ‌ర్గే స‌మ‌క్షంలో త‌న పార్టీ వైఎస్సార్‌టీపీని విలీనం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి బాధ్య‌త‌ల్ని అప్ప‌గించినా ప‌ని చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ఆమె ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  అటు ష‌ర్మిల నాయ‌క‌త్వంలో  ప‌ని చేయ‌డానికి తాను  సిద్ధమ‌ని గిడుగు రుద్రరాజు ప్రక‌టించారు.