రైతుల ప్రాణాలంటే కేసీఆర్​కు లెక్కలేదు

రైతుల ప్రాణాలంటే కేసీఆర్​కు లెక్కలేదు
  • రైతులను మోసం చేసిండు
  • నిరుద్యోగుల ఆత్మహత్యలూ పట్టించుకోవట్లే 
  • సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్ 
  • నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పాదయాత్ర 

నారాయణ పేట/ఊట్కూర్, వెలుగు:  రైతులకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేయకుండా మోసం చేశాడని వైఎస్సార్​టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో నిడుగుర్తి నుంచి లక్ష్మీపల్లి, ఊట్కూర్, పెద్ద పొర్ల, చిన్న పొర్ల గ్రామాల్లో ఆమె యాత్ర కొనసాగించారు. లక్ష్మీపల్లి వద్ద ఓ రైతుతో మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పొలంలో దిగి కొద్దిసేపు గునక తోలారు. పెద్ద పొర్ల గ్రామంలో మాటముచ్చటలో మాట్లాడారు. అరవై ఏండ్లలోపు రైతులకే రైతుబీమా ఇవ్వడం దారుణమన్నారు.

రైతుల ప్రాణాలంటే కేసీఆర్​కు లెక్కలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. ఆరోగ్యశ్రీని భ్రష్టుపట్టించారని, ఫీజు రీయింబర్స్ మెంట్ ను అటకెక్కించారని విమర్శించారు. ధరల పెంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోతున్నాయని అన్నారు. అందుకే ప్రజల సమస్యలపై గొంతెత్తేందుకే వైఎస్సార్​టీపీ వచ్చిందన్నారు. కాగా, ఊట్కూర్​ మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయా గ్రామాల రైతులు షర్మిలను కలిశారు. జీవో నంబర్ 69 అమలు చేసి నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని, ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని షర్మిల కోరారు.