
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత, డాక్టర్ ప్రవీణ్ ల బృందం షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ లెవల్స్ పడిపోయాయని, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉందన్నారు. వెంటనే షర్మిలను హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు.
రెండు రోజులుగా షర్మిల దీక్ష చేస్తున్నారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి షర్మిల ఆమరణ దీక్షను చేపట్టారు. పార్టీ కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు, కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు పెట్టారు. అయితే ప్రభుత్వం తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు.