కాళేశ్వరం తో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో లెక్క చెప్పాలె

కాళేశ్వరం తో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో లెక్క చెప్పాలె

పినపాక/ఖమ్మం: ఎస్సీ, ఎస్టీలంటే కేసీఆర్ కి లెక్కే లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 64వ రోజుకు చేరుకుంది. ఖమ్మంలోని పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురానికి చేరుకున్న షర్మిల... అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... అధికారంలోకి రాగానే మరిచిపోయారని మండిపడ్డారు. పట్టాలు ఇవ్వకపోగా... ఉన్న భూములను గుంజుకున్నారని ధ్వజమెత్తారు. రూ.3 వేల కోట్ల లాభాల నుంచి సింగరేణిని రూ. 8 వేల కోట్ల నష్టానికి తీసుకొచ్చారన్నారు. 

ఐటీసీ, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉన్నా... స్థానికులకు మాత్రం అందులో ఉద్యోగాలు లేవని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ టూరిజం కోసం కట్టినట్లు ఉందే తప్ప... దాని నుంచి రైతులకు పెద్దగా ఒరిగిన ప్రయోజనమేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును... రీడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారన్నారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నాయకులకే లబ్ది జరిగింది కానీ సామాన్య జనానికి కాదన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో కక్ష్య పూరిత రాజకీయం

రాహుల్ సభ కోసం బాగా పని చేయాలె