ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు, జగన్‌‌ తాకట్టు పెట్టారు : షర్మిల

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు, జగన్‌‌ తాకట్టు పెట్టారు : షర్మిల

హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా.. ప్యాకేజీ కూడా రాలేదని విమర్శించారు. ఈ పాపమంతా చంద్రబాబు, జగన్‌‌దేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీసులో ఏపీసీసీ చీఫ్‌‌గా షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌‌మోహన్ రెడ్డి దీక్షలు చేశారని, కానీ ఆయన సీఎం అయ్యాక ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. 

టీడీపీ, వైసీపీ కలిసి ఏపీని అప్పుల కుప్పగా మార్చాయని షర్మిల ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్ సీఎం అయ్యాక రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. కార్పొరేషన్ రుణాలు, ఇతర అప్పులు కలిపితే రూ.10 లక్షల కోట్ల మేర ఉన్నాయని చెప్పారు. ఇంత అప్పు చేసి ఇసుమంతైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు వంద శాతం పెరిగాయన్నారు. ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా దోచుకోవడం దాచుకోవడమే కనిపిస్తున్నదని మండిపడ్డారు. రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలో తెలియని దుస్థితి ఏపీలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఖర్చులు పదింతలు పెరిగాయని, అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

ఎవరో వదిలిన బాణాన్ని కాదు..

తెలంగాణలో ఓ నియంతను గద్దె దింపామని షర్మిల అన్నారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తనకూ ఓ లక్ష్యం ఉందని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్‌‌లో వైఎస్సార్‌‌‌‌టీపీని వీలినం చేశానని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠ పరిచేందుకు ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని చెప్పారు. రోజూ 3 జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఈ నెల 24న విజయవాడకు పార్టీ ఏపీ ఇన్‌‌చార్జి మాణిక్కం ఠాగూర్ వస్తారని, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి అప్లికేషన్లను తీసుకుంటామని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే వైఎస్ చివరి కోరిక అని, ఆ ఆశయం కోసం పనిచేస్తానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.