పోచారం ఫ్యామిలీపై షర్మిల ఫైర్​

పోచారం ఫ్యామిలీపై షర్మిల ఫైర్​

కోటగిరి, వెలుగు: స్పీకర్, అతని కుమారులు బాన్సువాడ నియోజకవర్గాన్ని బానిసవాడగా మార్చారని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. స్పీకర్​ అనుచరులు చేయని అక్రమ దందా లేదని, ఎవరైనా ఎదురు తిరిగితే ఇంటికి పిలిపించుకుని గన్స్​తో బెదిరిస్తున్నారన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కొనసాగింది. పాదయాత్ర 180వ రోజు 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్  ఉన్న రాష్ట్రాన్ని  కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, ఇన్‌‌‌‌పుట్ సబ్సిడీ, రుణాలపై వడ్డీ, ఎరువులపై సబ్సిడీ వంటి పథకాలను పక్కనపెట్టి కేవలం రైతు బంధు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారన్నారు.

స్టూడెంట్స్​కు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఎందుకివ్వడం లేదని, నోటిఫికేషన్లు ఎందుకు రిలీజ్​చేయడం లేదని ప్రశ్నించారు.  స్పీకర్​ పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్నారని, ఆయన అనుచరులు మొరం, ఇసుక, కంకర.. ఇలా దేన్నీ వదలడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని చెబుతున్న స్పీకర్​.. బాన్సువాడలో ఏం అభివృద్ధి జరిగిందో చూపెట్టాలన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ఆపేసి వెళ్లిపోతానన్నారు. బాన్సువాడకు వైఎస్​ ఎంతో చేశారని, నిజాంసాగర్​కు రూ.400 కోట్లు కేటాయించి కాలువలు రిపేర్లు చేయించడం వల్లే చివరి ఆయకట్టుకు నీరందుతోందన్నారు. కోటగిరి మండలానికి పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించారని, మంజీరా నదిపై బ్రిడ్జీ కట్టించారని చెప్పారు.