2000 కి.మీ.కు చేరుకోనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

2000 కి.మీ.కు చేరుకోనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

గత 8 ఏళ్లుగా సీఎం కేసీఅర్ ఏం చేశారో చెప్పాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వనపర్తి మండలం రాజపేట గ్రామస్థులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల.. అనంతరం సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరు చెప్పి ప్రతి వర్గాన్ని మోసం చేశారన్న ఆమె... మాట మీద నిలబడటం అంటే కేసీఆర్ కి తెలియదని విమర్శించారు. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు సైతం ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని షర్మిల చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు రాజన్న పాలన లేదని, కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని తెలిపారు. 2000 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోబోతున్న తనకు అడుగడుగునా సమస్యలే ఎదురయ్యానని వాపోయారు. కేసీఆర్ పాలన పోవాలని, వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ కావాలని వైఎస్ షర్మిల కోరారు. వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నేడు రెండు వేల కిలోమీటర్లకు చేరుకోనున్న సందర్బంగా వైఎస్సార్ పైలాన్ ను షర్మిల ఆవిష్కరించనున్నారు. నేడు 148వ రోజు వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. వనపర్తి మండలం రాజానగర్ కానలీ, రాజపేట మీదుగా దేవరకద్ర నియోజవకర్గంలోకి వైఎస్ షర్మిల అడుగు పెట్టనున్నారు. కొత్తకోట మండలం పరిధిలోని సంకిరెడ్డిపల్లి, ఎన్‌హెచ్ 44 మీదుగా కొత్తకోట టౌన్ కు చేరుకుంటారు.