మారిన షర్మిల పొలిటికల్ ప్లాన్.. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు

మారిన షర్మిల పొలిటికల్ ప్లాన్.. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు

వైఎస్సార్ టీపీ పార్టీతో తెలంగాణలో రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల సడెన్ గా చేసిన చిన్న చేంజ్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జనంలోకి వెళ్లిన ప్రతిసారీ నేను మీ వైఎస్సార్ బిడ్డ షర్మిలను అని ఆమె పరిచయం చేసుకునేవారు. ఇందులో కొంతకాలం కింద జరిగిన చిన్న మార్పును ఎక్కువ మంది గమనించలేదు. సడెన్ గా వైఎస్ షర్మిల కాస్తా వైఎస్ షర్మిల రెడ్డిగా మారిపోయింది. 

వైఎస్సార్ టీపీ ప్రెస్ నోట్లలో, షర్మిల సోషల్ మీడియా పేజీల్లోనూ పేరు షర్మిల రెడ్డిగా మారిపోయింది. ఆమె మాట్లాడేటప్పుడు, పలు ఇంటర్వ్యూల్లోనూ షర్మిల రెడ్డి అనే చెబుతున్నారు. దీంతో ఆమె ఏదో ఆలోచనతోనే ఈ మార్పు చేశారన్న చర్చ జరుగుతోంది.

గతంలో ఉపయోగించని రెడ్డి పేరును ఇప్పుడెందుకు వాడుతున్నది ఆసక్తిగా మారింది. ఎలక్షన్ దగ్గరపడడం, కులం కూడా ప్రభావం చూపించే పాయింట్ కావడం వల్లే ఆమె పేరులో రెడ్డి చేర్చారన్నది పార్టీ వర్గాల్లో టాక్. వైఎస్సార్ బిడ్డగా, బలమైన కులం ప్రతినిధిగా ఉండడమే రాజకీయంగా కలిసొచ్చే అంశం అంటున్నారు పలువురు లీడర్లు. ఆమె పోటీచేస్తానని చెప్పిన పాలేరు సెగ్మెంట్లోనూ రెడ్డి వర్గం కీలకంగా ఉంది. ఇది కూడా మరో కారణం కావచ్చంటున్నారు. 

 ఓవైపు కర్నాటక ఎన్నికల తర్వాత షర్మిల పార్టీపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె వరుసగా కర్నాటక కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ ను కలవడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే తెలంగాణతోనే తన రాజకీయం, భవిష్యత్ ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా రెడ్డి లీడర్ గా చెప్పుకునే ప్రయత్నం మాత్రం పొలిటికల్ ప్లానే అంటున్నారు.