గద్దర్ను కేసీఆర్ అవమానించారు..ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు: వైఎస్ షర్మిల

గద్దర్ను కేసీఆర్ అవమానించారు..ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు: వైఎస్ షర్మిల

గద్దర్ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేస్తే... సీఎం కేసీఆర్ గద్దర్ ను అవమానించారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే.. గద్దర్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అనేక సార్లు ప్రగతి భవన్ గేట్ ముందు కూర్చొని వెనుతిరిగారని.. ఆ రోజుల్లో గద్దర్ కంటతడి పెట్టుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గద్దర్  అంటే  చాలా ఇష్టం ఉండేదని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు గద్దర్ కు గన్ మన్ లతో  సెక్యూరిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన్ను పట్టించుకోలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గద్దర్ చనిపోయినప్పుడు ముసలి కన్నీరు కార్చారని విమర్శించారు. గద్దర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. గద్దర్ కుటుంబానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ టాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని సూచించారు. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో గద్దర్ జీవితాన్ని పొందుపర్చాలన్నారు. మెదక్ జిల్లాలోని గద్దర్ పుట్టిన గ్రామంలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.