కౌలుకు చేసేటోళ్లు రైతులు కారా?

కౌలుకు చేసేటోళ్లు రైతులు కారా?

అచ్చంపేట, వెలుగు:  సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగాయని వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆడవారికి రక్షణ లేని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. గురువారం నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. బల్మూర్​ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మైలార్ గేట్, కొండనాగుల, సీతారాంపూర్ మీదుగా రాంనగర్ కాలనీకి చేరుకుంది. యాత్రలో షర్మిల మాట్లాడుతూ.. కౌలు రైతులు అసలు రైతులే కారు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్​కు బార్లు, బీర్లపై ఉన్న ధ్యాస ప్రజా సంక్షేమంపై లేదన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివినోళ్లు కూలికి పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ వేల కోట్లు సంపాదించాడని, అచ్చంపేట ఎమ్మెల్యే కోట్లకు పడగలెత్తాడని.. ప్రజలు మాత్రం పేదలుగానే మిగిలారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.