పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నరు

పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నరు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘‘రాష్ర్టంలో ‘మేఘా’ మోసం జరుగుతోంది. రాష్ర్టంలో అన్ని కాంట్రాక్టులు ఒకే మనిషికి ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి స్కూల్ బెంచీల వరకు అన్ని కాంట్రాక్టులు ఆయనకే అప్పగించడంలో పెద్ద మోసం ఉంది” అని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాలమూరు నీళ్ల పోరు’ పేరుతో  జిల్లా కేంద్రంలోని టీటీడీ  కల్యాణ మండపం వద్ద షర్మిల బుధవారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో తక్కువ కమీషన్లు వస్తాయనే ప్రాజెక్టును పక్కనపెట్టిన కేసీఆర్.. ఎక్కువ కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ప్రేమ చూపారన్నారు. ‘‘మేఘా కృష్ణారెడ్డికి కాంగ్రెస్, బీజేపీ అమ్ముడుపోయాయి. ఆ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు రేవంత్​, బండి సంజయ్ ని ఆయన కొన్నారు. అందుకే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగినా వారిద్దరూ ప్రశ్నించడం లేదు” అని షర్మిల ఆరోపించారు. 

దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష.. 

కేసీఆర్ తన ఎనిమిదేండ్ల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని షర్మిల మండిపడ్డారు. పాలమూరు,రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. పాలమూరు జిల్లాను కేసీఆర్ మోసం చేస్తూ దెబ్బమీద దెబ్బ కొడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు జిల్లాపై ఆయనకు ప్రేమ లేదని, దక్షిణ తెలంగాణ అంటేనే సీఎం వివక్ష చూపుతున్నారని ఫైరయ్యారు.