రాజధాని కట్టలేదు, రోడ్లు వేయలేదు..అన్న పాలనపై షర్మిల ఫైర్

రాజధాని కట్టలేదు, రోడ్లు వేయలేదు..అన్న పాలనపై షర్మిల ఫైర్

ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.   జగన్ 3 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఏపీపై 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపారన్నారు. వైసీపీ మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదని మండిపడ్డారు. రాజధాని కట్టడానికి డబ్బులు కూడా లేవన్నారు.  ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. చివరకు రోడ్లు వేయడానికి డబ్బులు కూడా లేకుండా చేశారన్నారు. భూతద్దంలో చూసినా ఏపీ అభివృద్ధి కనపించడం లేదని విమర్శించారు. ఏపీ పాలకులు  పదేళ్లయినా  ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. 

ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు..పిల్లలకు ఉద్యోగాలు రాలేదన్నారు షర్మిల.  కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు.  ఏక్కడ చూసినా.. దోచుకోవడం దాచుకోవడమేనని ఆరోపించారు. ఎక్కడ చూసినా లిక్కర్, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. 

ఏపీలో బీజేపీ ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు షర్మిల.  బీజేపీతో టీడీపీ, వైసీపీ దోస్తీ ఎందుకని ప్రశ్నించారు.   బీజేపీతో దోస్తీ కోసం వైసీపీ,టీడీపీ పోలవరాన్ని తాకట్టపెట్టారని మండిపడ్డారు.  బీజేపీకి అమ్ముడుపోయేందుకు ఇన్ని జెండాలు ఎందుకు..టీడీపీ ,వైసీపీ కూడా బీజేపీ జెండా పెట్టుకుంటే సరిపోతుంది కదా ని ప్రశ్నించారు.  బీజేపీకి మతాలను రెచ్చగొట్టి మంట పెట్టుకోవడం..ఆ మంట కింద చలికాచుకోవడమే తెలుసన్నారు. వైఎస్సార్ బీజేపీకి ముమ్మాటి వ్యతిరేకని చెప్పారు.