ఇట్స్ కన్ఫామ్ : జనవరి 4న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరిక

ఇట్స్ కన్ఫామ్ : జనవరి 4న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరిక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచే వినిపిస్తోన్న ప్రచారమే ఇప్పుడు నిజం అయ్యింది. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది కన్ఫామ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా.. ఏకంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించేశారు. 2024, జనవరి 4వ తేదీన ఢిల్లీలో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కూడా అందింది ఆమెకు.

ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానని ప్రకటించారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, ఏపీ పీసీసీగా ఉండమని అడిగారని.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భవిష్యత్ లో  ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

షర్మిలకు ఏపీ పీసీసీ పదవి..?

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న దానిపైనా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆమెకు ఏఐసీసీ లేదా ఏపీ పీసీసీ పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుండగా.. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.