త్వరలోనే కాంగ్రెస్ లోకి షర్మిల .. గిడుగు రుద్రరాజు హాట్​ కామెంట్స్​

త్వరలోనే కాంగ్రెస్ లోకి షర్మిల .. గిడుగు రుద్రరాజు హాట్​ కామెంట్స్​

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో హల్ చల్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల చేరికపై పీసీసీ అధ్యక్షుడు గిడుగు మరోసారి స్పందించారు. తనకున్న సమాచారం మేరకు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు  వెల్లడించారు. షర్మిలతో పాటు పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పక ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలోనే కలుస్తానని గిడుగు వెల్లడించారు. తనకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.ఏఐసీసీ పెద్దలు, పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వీరి విషయంలో నడుచుకుంటామన్నారు.

షర్మిల వస్తే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చి పనిచేస్తామంటే అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా అందరం పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణయం హైకమాండ్ దేనని ఆయన అన్నారు. షర్మిల వచ్చి పనిచేస్తానంటే ఎవరూ అభ్యంతరం పెట్టే వారు ఉండరని గిడుగు రుద్రరాజు అన్నారు. అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. వ్యక్తిగత ఆలోచనలకు జాతీయ పార్టీలో తావు లేదని గిడుగు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు