తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?

తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా ఆమె సీఎంపై ఆరోపణలు చేశారు.  కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట!  అంటూ సామెతలు చెప్పి మరి సెటైర్లు వేశారు షర్మిల. ‘బయటి రాష్ట్ర రైతులకు 3 లక్షలు ఇస్తారా? 
మన రాష్ట్రంలొ కరోనాతో చనిపోయిన వాళ్లకు, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, ఆత్మహత్యలు చేసుకున్న  రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సారు? తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ’ అంటూ షర్మిల ట్వీట్ ద్వారా కేసీఆర్‌ను ప్రశ్నించారు. 

శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించారు. వ్యవసాయ సాగు చట్టాల కోసం చేసిన పోరాటంలో అమరులైనే రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున ఆర్దిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే తానే వెళ్లి స్వయంగా రైతు కుటుంబాలను కలిసి ఎక్స్ గ్రేషియా అంద చేస్తానన్నారు.