ఆ రాష్ట్రంతో.. జగన్‌తో మనకేంటి? : విజయమ్మ

ఆ రాష్ట్రంతో.. జగన్‌తో మనకేంటి? : విజయమ్మ

తన బిడ్డను చూసే హక్కు కూడా లేదా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. తన బిడ్డను చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. షర్మిలను పరామర్శించేందుకు బయల్దేరిన విజయమ్మను లొటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో   అక్కడే నిరాహార దీక్షకు దిగిన విజయమ్మ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.  షర్మిల ఇంటికొచ్చే వరకు దీక్ష చేస్తానన్నారు.  అసలు  షర్మిల చేసిన  నేరమేంటని నిలదీశారు. పాదయాత్ర చేస్తే తప్పా? పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించారు. తాము  ప్రభుత్వాలు నడిపామని..? తమకు పోలీసులు కొత్తేమీకాదన్నారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని.. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చెయ్యలేరన్నారు.

షర్మిలపై మూడు సెక్షన్లు

ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  షర్మిలతో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ లో నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని  షర్మిలపై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ తో ఎస్సార్ నగర్ పీఎస్ వద్దకు ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.