తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయ్!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయ్!

వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు రాజకీయంగా అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విజయమ్మ వెల్లడించారు. రెండు పార్టీల్లో కొనసాగడం సరికాదన్న ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తన కొడుకు జగన్ ను ప్రజల చేతుల్లో పెడుతున్నానని, తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతు ఉంటుందన్న విజయమ్మ.. తమ కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలు లేవని విజయమ్మ తేల్చిచెప్పారు.

షర్మిలకు నా అవసరం ఉంది

తాను రాయని, చేయని సంతకంతో.. సోషల్ మీడియాలో రాజీనామా లేఖ విడుదల చేయడంపై విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి జుగుప్సకర రాతలు అని... ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసిందన్నారు. తాను రాయని.. చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిలకు తన అవసరం ఉందని..అందుకే  తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు.  రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదన్నారు. వైఎస్సార్‌ లేని లోటును తనకు ఎవరూ తీర్చలేరన్నారు. ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా అని విజయమ్మ అన్నారు.

ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్దాలే

వైఎస్సార్ ఆశయాల మేరకు ప్రజాసేవ చేసేందుకే తెలంగాణలో షర్మిల వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టిందన్నారు.  తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయన్నారు.  తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుందన్నారు. ఎల్లో మీడియాలో ఏదిబడితే అది రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం దురదృష్టకరమన్నారు.ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ అన్నారు.