వైఎస్‌ఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి

వైఎస్‌ఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి

ప్రజల పక్షాన నిలబడేందుకే పార్టీ పెట్టానని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గంలోని నర్సాపూర్ మండలం నట్నాయ్యపల్లి గ్రామంలో పర్యటించిన వైఎస్ షర్మిల... కొట్లాడక పోతే ఏదీ రాదని చెప్పారు. మాట్లాడక పోతే ఏ సమస్య తీరదన్న ఆమె... ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధమని... మీ జీవితాలను మార్చే ఆయుధమన్నారు. వైఎస్సార్ ఏ పథకం పెట్టినా ప్రజల కోసమే పెట్టాడన్న షర్మిల.. అలాంటి వైఎస్సార్ నాయకత్వం మళ్ళీ రావాలని పిలుపునిచ్చారు. 

ఈ కేసీఆర్ కో లేక బీజేపీకో, కాంగ్రెస్ కో ఓటేస్తే మీ జీవితం మారదని షర్మిల చెప్పారు. 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రజలకు చేసింది మోసమేనని ఆరోపించారు. కేసీఆర్ అరాచకాలపై ఏనాడూ ప్రతిపక్షాలు పోరాటం చేయలేదన్న షర్మిల... ఏ ఒక్క నాయకుడూ ప్రజల పక్షాన నిలబడింది లేదని విమర్శించారు. రుణమాఫీ జరగకపోతే ఎవరు కొట్లాడారు..? డబుల్ బెడ్ రూం ఇల్లులు ఇవ్వకపోతే ఎవరు కొట్లాడారు..?- ఉద్యోగాలు ఇవ్వక పోతే ఎవరు కొట్లాడారు..? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తూ... ఆగ్రహం వ్యక్తం చేశారు.