రెండో ఏడాదిలోకి వైఎస్సార్​ తెలంగాణ పార్టీ

రెండో ఏడాదిలోకి వైఎస్సార్​ తెలంగాణ పార్టీ
  • వైఎస్సార్​ తెలంగాణ పార్టీ రెండో ఏడాదిలోకి
  • షర్మిల ఆధ్వర్యంలో ఇయ్యాల పలు కార్యక్రమాలు
  • ఇడుపులపాయలో వైఎస్సార్​సమాధి వద్ద నివాళి
  • హైదరాబాద్​లోని పార్టీ  ఆఫీస్​లో వేడుకలు

హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్​ తెలంగాణ పార్టీ తొలి ఏడాది పూర్తి చేసుకొని శుక్రవారంతో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఇదే రోజున వైఎస్సార్  74 వ జయంతి కావడంతో షర్మిల ఆధ్వర్యంలో ఆ పార్టీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. హుజూర్​నగర్​లో పాదయాత్రలో ఉన్న  షర్మిల గురువారం ఉదయమే ఏపీలోని పులివెందులకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పించి ప్రార్థన చేయనున్నారు. హైదరాబాద్​లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ​నిర్వహణకు, జయంతి వేడుకలకు పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా.. 

పోయినేడు వైఎస్సార్ జయంతి రోజున ఆవిర్భవించిన వైఎస్సార్​టీపీ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటోంది. ఏడాది పొడవునా ప్రజల్లో ఉండేందుకు షర్మిల ప్రాధాన్యమిచ్చారు. పాదయాత్ర చేపట్టడటంతో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. వాళ్లకు ఆర్థిక సాయం అందించటంలో ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల ఎండగట్టారు. పార్టీ పేరు ప్రకటన ముందు నుంచీ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు. నిరుడు ఏప్రిల్ 15 న జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో ఒకరోజు, ఇంకో రెండ్రోజులు లోటస్​పాండ్​లో దీక్ష నిర్వహించారు. అంతకు వారం ముందు సంకల్ప సభ పేరుతో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

వైఎస్సార్ బాటలోనే.. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రస్థాన యాత్రకు షర్మిల శ్రీకారం చుట్టారు. 90 నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. 2004కు ముందు వైఎస్సార్ మొదలు పెట్టిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే నిరుడు ఏప్రిల్​20న షర్మిల యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో విడతగా నల్గొండ జిల్లా కోదాడ, హుజూర్​నగర్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా116 రోజుల పాటు, 1,555 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు. షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర త్వరలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, ఆపై ఉత్తర తెలంగాణలోకి ప్రవేశించనుంది.