పాలేరు నుంచి షర్మిల పోటీ ఖరారు

పాలేరు నుంచి షర్మిల పోటీ ఖరారు
  • ఈ రోజు నుంచి నా ఊరు పాలేరు
  • పాలేరు నుంచే దశ..దిశ నిర్దేశం
  • వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ఇక నుంచి పాలేరు నా పుట్టిల్లు మాత్రమే కాదు.. నా ఊరు కూడా పాలేరు అని ఆమె అన్నారు. పాలేరు నుంచే దశ..దిశ నిర్దేశం అవ్వాలంటూ నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. 
పాలేరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్టీ పతాకాన్ని రెపరెప లాడించాలని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. చరిత్రలో ఎరగని మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ‘13 వందల కిలోమీటర్లు నడిచింది నేనే అయినా...నడిపించింది మీరే.. పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు..మీరు కోరుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారు.. ఇది వై ఎస్ ఆర్ కు ఉన్న చరిష్మా.. వైఎస్సార్ అనే మూడు అక్షరాలకు ఉన్న బలం.. ఇక మన సొంతం.. వైఎస్సార్ పేరు అస్తి అయితే ఏకైన వారసులం మనమే.. తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా నాకే ఉంది.. ఇతర వ్యక్తికి లేదా మరే ఇతర పార్టీకి ఆ హక్కులేదు.. వైఎస్సార్ మీద ఉన్న అభిమానమే మన ఆస్తి..’ అని షర్మిల అన్నారు. 
ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా

‘పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఈరోజుది కాదు..ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజక వర్గం.. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదు.. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉంది.. ముఖ్యంగా ఎక్కువగా వినిపిస్తున్న స్వరం పాలేరు నుంచి పోటీ చేయాలని...అడుగడుగునా హారతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ చెప్తున్నారు.. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు.. కాబట్టి దేవుడు తథాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకం..ఇవ్వాళ్టి నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది మీ కోరిక కాదు...నా కోరిక కూడా..’ అని షర్మిల ప్రకటించారు. 

పాలేరు గడ్డపై వైఎస్సార్ పార్టీ పతాకం ఎగరాలి, అత్యధిక మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలని వైఎస్ షర్మిల కోరారు. చరిత్రలో మీరు.. నేను.. ఎన్నడూ ఎరగని మెజారిటీ కోసం పని చేద్దామని ఆమె కోరారు. ‘ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు.. వైఎస్ ఆర్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదకు తేవాలి..ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరు పుట్టిన ఇల్లు.. పాలేరు నియోజక వర్గం ఒక దిశా - నిర్దేశం అవ్వాలి..వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అంతా మీ వైపు చూడాలి.. ముందు వరసలో పాలేరు ఉండాలి.. పార్టీ అభివృద్ధిలో ఎక్కడా లేనంత ముందు వరసలో ఉండాలి.. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి.. ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలి.. షర్మిలమ్మ మన నియోజక వర్గం అని చెప్పాలి..మీరు ముందు ఉండాలి ..అందరికీ ఆదర్శం అవ్వాలి..’ అని షర్మిల పేర్కొన్నారు.