మక్కెలు ఇరుగుతాయ్ పవన్ కల్యాణ్ : రెండు చెప్పులు చూపించిన నాని

మక్కెలు ఇరుగుతాయ్ పవన్ కల్యాణ్ : రెండు చెప్పులు చూపించిన నాని

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కలకలం రేపుతోంది. చెప్పులతో కొడతాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని. 2023, జూన్ 15వ తేదీ ఉదయం బెజవాడలోని పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఆయన.. నీ కన్నా పెద్ద మొగోడిని.. మక్కెలు ఇరిగిపోతాయ్ పవన్.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే రెండు చెప్పులతో వాయిస్తానంటూ.. రెండు చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు నాని. 

కత్తిపూడి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం.. చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు నాని. సినిమాలను అడ్డుకుంటున్న చెబుతున్న పవన్.. ఏ సినిమాను అడ్డుకున్నది చెప్పగలరా అని సవాల్ చేశారు. అబద్దాలు ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ ఘాటుగా స్పందించారు నాని. 

పవన్ కల్యాణ్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్ర అంటూ మండిపడ్డారు. పార్టీ పెట్టి ఎవరు ఎవరికి ఊడిగం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. యాత్రను ఎవరూ అడ్డుకోవటం లేదని.. అన్ని అనుమతులు ఇచ్చామని స్పష్టం చేసిన నాని.. యాత్రల్లో జనం చచ్చిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలని అని ప్రశ్నించారు. 

నోరు అదుపులో పెట్టుకుని.. నిజాలు మాట్లాడాలని లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవంటూ పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు పేర్ని నాని.