చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపట్టిందా?మా ఇంట్లో మమ్మల్నే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
విడదల రజిని హౌస్ అరెస్ట్‌లో ఉన్నందున బయటకు వెళ్లకూడదని పోలీసులు సూచించారు. అలాగే, ఇంటి లోపలికి ఎవరినీ అనుమతించవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. అయితే, పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా విధుల్లో ఉన్న ఎస్ఐ అడ్డుకోవడంతో ఆమె కిందపడిపోయారు
శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత. అదే సమయంలో విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలి. రాజకీయ నాయకులైనా, సామాన్యులైనా చట్టానికి లోబడి వ్యవహరించాలనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
