
- ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా?
- సీఎం కేసీఆర్పై షర్మిల ఫైర్
- రైతులను ఆదుకోని కమీషన్ల రావు
- దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడని నిలదీత
హైదరాబాద్, వెలుగు: ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఏంటో చెప్పాలని సీఎం కేసీఆర్ను వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా అని నిలదీశారు. రైతుల అప్పుల విషయమై కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘37 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ బీఆర్ఎస్ లక్ష్యమా? ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కిసాన్ సర్కార్ అంటారా? సబ్సిడీ పథకాలను బంద్ చేసిన మీది సంక్షేమ ప్రభుత్వం ఎలా అవుతుంది? ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి మరో చేత్తో వెనక్కు తీసుకోవడం రైతును ఆదుకున్నట్లా? ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం, బ్యాంకుల ముందు రైతులను మోసగాళ్లుగా చేయడం, రైతు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం.. ఇదేనా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్?” అని షర్మిల నిలదీశారు.
ఇది ‘ఆప్ కీ బర్బాత్ సర్కార్’ అని ఫైరయ్యారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని, రుణమాఫీ జాడ లేదని మండిపడ్డారు. రైతులను అప్పులపాలు చేసి కోటీశ్వరులను చేశానని కేసీఆర్ చెప్పే మాటలను జనం నమ్మే రోజులు పోయాయన్నారు. రైతులను ఆదుకోని కమీషన్ల రావు.. దేశాన్ని ఉద్ధరిస్తారా? అని ఆమె మండిపడ్డారు.