పంపు హౌస్ లు మునిగినా.. దొర పట్టించుకుంటలేడు

పంపు హౌస్ లు మునిగినా.. దొర పట్టించుకుంటలేడు

మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు.... కేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అందుకే మేఘా కంపెనీ నిర్మించిన  పంపు హౌస్ లు మునిగినా.. దొర పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం భారీ ప్రాజెక్టు అల్లకల్లోకంగా మారింది. గోదావరి వరద ఉధృతికి పంపుహౌస్‌‌లు పూర్తిగా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్, మేఘా కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో భాగంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఇటీవల మరణించిన కార్మికుల విషయాన్నీ లేవనెత్తారు. కార్మికులల ప్రాణాలు తీసినా కేసీఅర్ కంటపడదని... గుట్టలు కొల్లగొట్టి మట్టిని, ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించినా... దొరకు కానరాదని ఎద్దేవా చేశారు. 

రూల్స్ కు విరుద్ధంగా చేసిన బ్లాస్టింగ్ ల వల్లే పంపుహౌస్ లు మునిగినా అవి దొర కమీషన్లు పెంచుకోవడానికి పనికొస్తాయని చెప్పుకొచ్చారు. అంతే తప్పితే మేఘా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం పనికిరావని ఆరోపించారు. దొంగలకు సద్ది కట్టినట్టు కాంట్రాక్టులన్నీ మేఘాకు కట్టబెట్టారన్న ఆమె.. మేఘా తీగ లాగితే తన అవినీతి డొంక కదులుతుందని కేసీఅర్ కు భయపడుతున్నారని విమర్శించారు. అందుకే కేసీఆర్ గారు మేఘా మీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.