
- సోమాజిగూడలో అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు
- కారులో ఉండగానే టోయింగ్ వెహికల్తో ఎస్ఆర్ నగర్ స్టేషన్‌కు తరలింపు
- నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. బెయిల్ మంజూరు
- ఇది ప్రజాస్వామ్యం కాదు.. గూండాల రాజ్యం: షర్మిల
హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్ల దాడి, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేసిన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారులోంచి దిగకపోవడంతో టోయింగ్ వెహికల్ తీసుకువచ్చి కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. స్టేషన్‌లో బలవంతంగా కారు డోర్లు ఓపెన్ చేసి.. షర్మిల, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు.
ట్రాఫిక్ జామ్ అవుతోందంటూ..
షర్మిల పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతుండగా.. సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆమెపై దాడికి ప్రయత్నించారు. కారు అద్దాలు పగుల గొట్టారు. కార్‌వ్యాన్‌కు నిప్పుబెట్టారు. ఫ్లెక్సీలు, జెండాలు దహనం చేశారు. కొందరు నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. అయితే దాడి చేసిన వారిని కాకుండా షర్మిల సహా వైఎస్సార్ టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసుల తీరును నిరసిస్తూ ధ్వంసమైన వాహనాలతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని షర్మిల ప్రకటించారు. టీఆర్‌ఎస్ నాయకులు ధ్వంసం చేసిన కారు, కారవ్యాన్ తీసుకుని అనుచరులతో కలిసి లోటస్ పాండ్‌లోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం 11.30కు బయల్దేరారు. ధ్వంసమైన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వద్ద అడ్డుకున్నారు. కారు దిగాలని పోలీసులు కోరగా.. ఆమె నిరాకరించారు. తన అనుచరులతో కలిసి కారులోనే కూర్చొని డోర్లు లాక్ చేసుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు టోయింగ్ మిషన్ తీసుకువచ్చి షర్మిల సహా పలువురు కారులో ఉండగానే అమీర్‌పేట మీదుగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు.ఈ క్రమంలో పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. ఎస్‌ఆర్ నగర్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా కారు దిగేందుకు షర్మిల నిరాకరించారు. పోలీసులు బలవంతంగా డోర్లు ఓపెన్ చేసి షర్మిల సహా ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడితే దాడి చేస్తరా?
తాను కారులో ఉండగానే టోయింగ్ మిషన్‌తో లాక్కెళ్లడంపై షర్మిల మండిపడ్డారు. కారు లోంచే పలు మీడియా సంస్థలతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. కేసీఆర్, పోలీసుల తీరును తప్పుబట్టారు. ‘‘కేసీఆర్ ఒక మహిళ మీద దాడి చేయిస్తున్నరు. ఇలా చేయటానికి సిగ్గుండాలి కదా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి యాత్ర చేస్తుంటే పెట్రోల్‌తో దాడి చేశారు’’ అని మండిపడ్డారు. రాష్ర్ట ఖజానాను సీఎంతో సహా ప్రతి ఎమ్మెల్యే లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళ 3,500 కిలోమీటర్ల యాత్ర చేస్తుంటే ఎందుకు దాడులు చేస్తున్నరని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, టీఆర్ఎస్ గూండాల రాజ్యమని అన్నారు. యాత్రకు అనుమతి ఉందని, కేవలం ప్రజా సమస్యలపై యాత్ర చేస్తున్నందుకే ఈ దాడి జరిగిందని చెప్పారు. షర్మిలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమె అనుచరులు కొందరు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ ఎదుట నిరసన తెలపడానికి వచ్చిన వైఎస్సార్‌టీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులకు దెబ్బలు తగిలాయి.
ఎల్లుండి నుంచి యాత్ర ప్రారంభిస్త
ఎల్లుండి నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు షర్మిల చెప్పారు. అనుమతితోనే యాత్ర చేస్తున్నా అడ్డుకున్నారని, టీఆర్ఎస్ నేతలు దాడి చేస్తే పోలీసులు అరెస్ట్ చేయలేదని, కేసులు పెట్టలేదని మండిపడ్డారు. అరెస్టుపై ప్రశ్నించడానికే ప్రగతి భవన్ వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. తాము ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించలేదని, పోలీసులే వెహికల్ అడ్డుపెట్టారని అన్నారు.
షర్మిల ఫైటర్: బ్రదర్ అనిల్
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా షర్మిల పోరాటం కొనసాగుతుందని బ్రదర్ అనిల్ తేల్చిచెప్పారు. మంగళవారం సాయంత్రం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల మీద ఒత్తిడి ఉందని అర్థమవుతున్నదని, ఈ విషయంలో లీగల్‌గా ముందుకెళ్తామని చెప్పారు. ‘‘షర్మిల ఫైటర్. వైఎస్ఆర్ లాంటి పోరాట పటిమ ఆమెలో ఉంది. ఇలాంటివి ఎన్నో చూశాం. రాజ్ భవన్ ముందు బైఠాయించాం. జైలుకు వెళ్లాం. కోర్టులకు హాజరయ్యాం” అని చెప్పారు. బస్సును కాల్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని, కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
పలు సెక్షన్ల నమోదు
వైఎస్ షర్మిల సహా పలువురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 143, 341, 290, 506, 509, 336, 353 ,382 రెడ్‌విత్149 సెక్షన్ల కింద ఫైల్ చేశారు. మంగళవారం రాత్రి స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలను 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ టి.కన్యాలాల్ ఎదుట హాజరు పరిచారు. షర్మిలతో పాటు ఆరుగురు నిందితులకు వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో షర్మిల సహా ఆరుగురు బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అంతకుముందు నిందితులకు రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. లా అండ్ అర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. షర్మిల అరెస్ట్ అక్రమమని కోర్టుకు ఆమె తరుపు లాయర్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతుంటే అడ్డుకున్నారని, తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. వాదనలు విన్న జడ్జి.. షర్మిల, ఆమె అనుచరులకు బెయిల్ మంజూరు చేశారు.
విజయమ్మ దీక్ష
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తన కూతురు షర్మిలను పరామర్శించేందుకు లోటస్ పాండ్ నుంచి వెళ్లేందుకు వైఎస్ విజయమ్మ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె బయటకు రాకుండా నియంత్రించారు. దీంతో విజయమ్మ తన నివాసం గేటు ఎదుట బైఠాయించి దీక్షకు కూర్చున్నారు. “వైఎస్ విగ్రహాలు కాల్చారు. ఫ్లెక్సీలు చించేశారు. యాత్రకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. షర్మిలకు గాయాలయ్యాయి. ఆమె ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నది. నిరసన తెలపటం, ధర్నాలు చేయటం తప్పు కాదు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలపటానికి వెళ్తే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు” అని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. అధికారం శాశ్వతమని పాలకులు అనుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. అంతే తప్ప తప్పుగా ఎక్కడా మాట్లాడలేదని, అసలు షర్మిల చేసిన నేరమేంటని ప్రశ్నించారు. తన కూతురిని చూసే హక్కు కూడా తనకు లేదా అని విజయమ్మ నిలదీశారు. అనంతరం వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ షర్మిలకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేయటంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయం గెలిచిందని ఆమె పేర్కొన్నారు.