ఉద్యోగాలు భర్తీ చేసే దాకా మంగళవారం నిరసన దీక్షలు 

ఉద్యోగాలు భర్తీ చేసే దాకా మంగళవారం నిరసన దీక్షలు 

వనపర్తి: దేశంలోనే అత్యధిక మంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో  తెలంగాణ ఒకటని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. వనపర్తి జిల్లా, గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో నిరసన దీక్షను ఆరంభించిన షర్మిల.. సీఎం కేసీఆర్‌‌ను మొద్దు నిద్ర నుంచి లేపటం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ, నిరసన దినంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రకటిస్తోందన్నారు.  

‘నేను పార్టీ పెట్టకముందు నుంచే నిరుద్యోగుల కోసం పోరాడుతున్నా. ఉద్యోగ నోటిఫికేసన్లు విడుదల చేయాలంటూ మూడ్రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేపట్టా. ఇప్పుడు నిరుద్యోగుల తరఫున పోరాటాన్ని మొదలుపెడుతున్నా. అదే పోరాట స్ఫూర్తితో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతా. దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నడు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.