
తన పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా చామనపల్లిలో తమ పార్టీ శ్రేణులపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని.. అయినా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. నైట్ క్యాంప్ ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి రాగానే మృగాలుగా మారారని విమర్శించారు. పోలీసులకు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు.
పోలీసులు గులాబీ కండువాలు.. గులాబీ నెక్కర్లు వేసుకొని తిరగాలని షర్మిల మండిపడ్డారు. ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకొని.. టీఆర్ఎస్ నేతలకు ఊడిగం చేస్తారా అని అడిగారు. తాము పాదయాత్ర చేయకూడదా.. ప్రజలపక్షాన నిలబడకూడదా అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి బయటపడుతుందని..ఇంత జరుగుతున్నా బీజేపీ,కాంగ్రెస్ నోరు విప్పడం లేదని విమర్శించారు.
తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం బతికుందా అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడటం నేరమా అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని.. రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. వైఎస్సార్ ఫ్లెక్సీలు, విగ్రహాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే ఏకైక వ్యక్తిని తానేనని షర్మిల చెప్పారు.