టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్: షర్మిల

టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నయ్: షర్మిల

ఆదిలాబాద్: కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తాలిబన్  ప్రభుత్వం నడుస్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఖానాపూర్ లో పర్యటిస్తున్న షర్మిల.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఖానాపూర్ లో 50 వేల ఎకరాల పోడు భూములకు వైఎస్ఆర్ పట్టాలు కల్పించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్క ఎకరం పోడు భూమికి కూడా పట్టాలు కల్పించకపోగా.. ఉన్న భూములను లాక్కున్నారని మండిపడ్డారు. పోడు భూముల గురించి ప్రశ్నించినందుకు మహిళలు అని కూడా చూడకుండా ఆదివాసీ బిడ్డలను జైలులో పెట్టించారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇది రౌడీల రాజ్యం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్జిలు వేసింది.. విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 

ఎమ్మెల్యే రేఖా నాయక్ కమీషన్లు వసూలు చేస్తోంది

స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ పై షర్మిల విరుచుకుపడ్డారు. ఖానాపూర్ కు ఏం చేసిందో చెప్పాలని రేఖా నాయక్ ను నిలదీశారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి దాంట్లో ఆమె దందాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు రావాల్సిన డబ్బుతో ఎమ్మెల్యే రేఖా నాయక్ రైస్ మిల్లులు నిర్మించుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేకు కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పారిపోయారని చెప్పారు.

డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుండ్రు

డబ్బులు సంపాదించుకోవాలనే సింగిల్ ఎజెండాతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఉదంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమాయకులైతే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర లేకుంటే సీబీఐతో ఎందుకు విచారణ జరిపించడం లేదని బీజేపీని నిలదీశారు.  టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయని షర్మిల ఆరోపించారు.