మక్క రైతులకు ‘కత్తెర’ గోస

మక్క రైతులకు ‘కత్తెర’ గోస

మొక్కజొన్నపై ‘ఫాల్​ ఆర్మీ వార్మ్’ పెను ప్రభావం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:మొక్కజొన్న పంటకు పెను ప్రమాదకారి అయిన ‘కత్తెర పురుగు’ ప్రస్తుతం మొక్కదశలో ఉన్న మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. రాష్ట్రంలో మొక్కజొన్న సాధారణ సాగు 12 లక్షల 52 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 7 లక్షల 45 వేల ఎకరాల్లో సాగైంది. కొద్దిపాటి జల్లులతో ఇప్పడిప్పుడే ఎదుగుదల దశలో ఉన్న మొక్కజొన్నపై అప్పుడే కత్తెర పురుగు దాడి మొదలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కత్తెర పురుగు విధ్వంసం ప్రారంభమైతే పంటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మొక్కజొన్న ఆకులను తినడమే కాక, కాండంలోకి చొచ్చుకు పోతూ, ఇది మొక్కను పూర్తిగా నాశనం చేస్తుండటంతో రెండేళ్లుగా పంటకు తీవ్ర వినాశకారిగా మారింది.

సౌత్అమెరికా టు ఇండియా వయా ఆఫ్రికా 

కత్తెర పురుగు (ఫాల్‌‌‌‌ ఆర్మీవార్మ్‌‌‌‌) దక్షిణ అమెరికా దేశాల్లో మొదలైంది. ఇది అక్కడి మొక్కజొన్న పంటలకు పెను ప్రమాదకారిగా మారింది. అక్కడి నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాల మీదుగా ఇది ఇండియాకు వచ్చింది. రెండేళ్లుగా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల మొక్కజొన్న పంటలపై దాడులు చేస్తోంది. దీంతో మొక్కజొన్నపై తీవ్ర ప్రభావం చూపుతూ దేశ ఆహారభద్రతకే పెనుముప్పుగా మారుతోంది. తక్కువ కాలంలో వివిధ ప్రాంతాలకు విస్తరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలోని మొక్కజొన్న పంటలపై ఇది విరుచుకుపడుతోంది.

దాడి చేస్తే సర్జికల్‌‌‌‌ స్ట్రైకే..

కత్తెర పురుగు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్జికల్‌‌‌‌ స్ట్రైకే. మొక్కజొన్నపై దాడి చేసి పంటనంతా నాశనం చేస్తుంది. అందుకే దీన్ని  ఫాల్‌‌‌‌ ఆర్మీవార్మ్‌‌‌‌ అని పిలుస్తారు. మొదట తల్లిపురుగు రెక్కలతో ఉండి ఒకసారి గాల్లోకి ఎగిరితే ఏకధాటిగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 90 రోజుల జీవితకాలంలో రెండు దశల్లో 1500 గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి వచ్చే పిల్లలే లార్వాలు. ఇవే కత్తెర పురుగులు. ఇవి గుంపులుగా తిరుగుతూ ఆకులను తినేస్తాయి. రెండో దశలో ఈ పురుగులు మొక్క కాండం మొవ్వులో చేరి కాండాన్ని తింటాయి. మొవ్వును పూర్తిగా తినడంతో పూత పోయి కంకి తయారవ్వదు. కంకి తయారయ్యే సమయంలోనూ ఈ పురుగులు కంకులలో దూరి లేత గింజలను తినేస్తాయి. ఈ పురుగు మొదట మొక్కజొన్న పంటపైనే దాడి చేస్తుంది. అది అందుబాటులో లేకుంటే వరి, గోధుమ, జొన్న, సజ్జ, చిరు ధాన్యాలు, చెరకు, పత్తి, కూరగాయలు వంటి 86 రకాల పంటలపై ప్రభావం చూపుతుంది.

సేంద్రియ పద్ధతులే మేలు

కత్తెర పురుగును క్రిమి సంహారక మందులతో అరికట్టడం అంత తేలికకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  మొక్కజొన్న సుడులలో మట్టి, బొగ్గు పొడి, రాతి పొడి, బూడిద వేయడం, కొన్నింటిలో వేపగింజల కషాయం, అగ్ని అస్త్రం, ఉప్పు, పచ్చిమిర్చి ద్రావణం, సుడులలో పిచికారీ చేయడం వంటి పద్ధతులతో దీనిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు.

అంతరపంటలతో అడ్డుకట్ట

పొలం అంతా మొక్కజొన్న పంటను మాత్రమే సాగు చేసే ప్రాంతాల్లో కత్తెర పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో అంతర పంటగా, చుట్టూ కంచెగా నాపియర్‌‌‌‌ గడ్డి వేస్తే కత్తెర పురుగు ఉధృతి తగ్గుతుంది. మొక్కజొన్నతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు అంతర  పంటలుగా కలిపి సాగు చేస్తే ఇది వ్యాప్తి చెందదని శాస్తవేత్తలు చెబుతున్నారు.