ఉక్రెయిన్ రేడియేషన్ డిజాస్టర్ నుంచి ప్రపంచం తృటిలో తప్పించుకుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజియాకు చాలా సమయం పవర్ సప్లై నిలిచిపోయిందన్నారు. దీంతో రేడియేషన్ డిజాస్టర్ ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు. తమ సిబ్బంది చొరవతో ముప్పు తప్పిందన్నారు. మరోవైపు ప్లాంట్ ను వీడేలా రష్యా దళాలపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్ స్కీ యావత్ ప్రపంచ దేశాల అధినేతలను కోరారు. ఉక్రెయిన్ ను, ఐరోపా వాసులను రష్యా రేడియేషన్ ప్రమాదంలోకి నెట్టిందన్నారు.
రష్యా దాడులతో న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలోని కోల్ ప్లాంట్ యూనిట్ లో మంటలు చెలరేగాయని జెలెన్ స్కీ తెలిపారు. దీంతో జపోరిజియాకు పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. ఉక్రెయిన్ సిబ్బంది బ్యాకప్ డీజిల్ జనరేటర్ల సాయంతో పవర్ సప్లైని పునరుద్ధరించారని, దీంతో ప్లాంట్ లోని కూలింగ్ సిస్టమ్ సహా ఇతర వ్యవస్థలు యథావిధిగా పని చేశాయని, లేకపోతే ఇప్పటికే రేడియేషన్ విపత్తు పరిణామాలను అధిగమించే చర్యలు తీసుకోవాల్సి వచ్చేదని జెలెన్ స్కీ తెలిపారు. ప్లాంట్ అవసరాలకు ప్రస్తుతం ఉక్రెయిన్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ నుంచి పవర్ సరఫరా అవుతోందని, ప్లాంట్ లో ఉన్న రెండు రియాక్టర్లకు గ్రిడ్ కనెక్షన్ ను పునరుద్ధరించే పని కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
