రష్యాపై కఠిన ఆంక్షలు విధించండి

రష్యాపై కఠిన ఆంక్షలు విధించండి
  • బ్రిటన్​ను కోరిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ
  • రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని రిక్వెస్ట్

లండన్: రష్యాను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​ స్కీ బ్రిటన్​ను కోరారు. ఉక్రెయిన్ ఎయిర్​ స్పేస్ భద్రంగా ఉండేలా ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని బ్రిటిష్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్​స్కీకి మద్దతుగా ఎంపీలంతా లేచి నిలబడి సంఘీభావం తెలిపారు. ‘‘మేము ఐరోపా దేశాల సాయం కోరుతున్నం. మీ సాయం కోసం ఎదురుచూస్తున్నం. ఇప్పటివరకు మీరెంతో సాయం చేశారు. థ్యాంక్స్. దయచేసి రష్యాను టెర్రరిస్ట్ దేశంగా గుర్తించి కఠిన ఆంక్షలు పెట్టండి. మీరు చేయాల్సినంత చేయండి” అని జెలెన్ స్కీ.. బ్రిటన్ ప్రధాని జాన్సన్ బోరిస్​ను కోరారు.

చివరిదాకా పోరాడుతం
ఈ సందర్భంగా బ్రిటన్ యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న విన్​స్టన్​ చర్చిల్ మాటలను జెలెన్​ స్కీ సభలో ప్రస్తావించారు. రష్యా దళాలతో నింగి, నేల, సముద్రంలో పోరాడుతామని చెప్పారు. చివరిదాకా కొట్లాడుతామని, ఎన్నటికీ ఓడిపోబోమని అన్నారు. ‘‘మేం ఓడిపోము. ఓడిపోము. చివరిదాకా పోరాడుతాం. మా భూమి కోసం సముద్రంలో, గాలిలో పోరాడుతాం. అడవులు, వీధుల్లో పోరాడుతాం” అని జెలెన్​స్కీ ఉద్వేగభరితంగా అన్నారు. రష్యా దాడుల గురించి కూడా ప్రస్తావించారు. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కోరుకోలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు పోరాడక తప్పడంలేదని జెలెన్​స్కీ అన్నారు. అనంతరం జాన్సన్ బోరిస్ మాట్లాడారు. ‘‘జెలెన్​స్కీ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించారు”అని అన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ముందుకెళ్తామని బోరిస్ హామీ ఇచ్చారు.